చైన్నె విమానాశ్రయంలో అరుదైన ఘటన | - | Sakshi
Sakshi News home page

చైన్నె విమానాశ్రయంలో అరుదైన ఘటన

Oct 11 2026 5:24 AM | Updated on Oct 11 2026 5:24 AM

● ఒకే రోజు రెండు అతిపెద్ద కార్గో విమానాలు ల్యాండింగ్‌

సాక్షి, చైన్నె: చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో అంతర్జాతీయ సరుకు రవాణా రంగంలో ఒక అరుదైన మైలురాయి నమోదైంది. ప్రపంచంలోనే అత్యంత భారీ రకానికి చెందిన రెండు పెద్ద కార్గో (సరుకు రవాణా) విమానాలు ఒకే రోజు ఒకదాని తర్వాత ఒకటి చైన్నె విమానాశ్రయంలో దిగి, సరుకును దించి, తిరిగి ఎక్కించుకుని వెళ్లడం విశేషంగా నిలిచింది. వియత్నాం రాజధాని హనోయ్‌ నుండి వచ్చిన భారీ బోయింగ్‌ 747 కార్గో విమానం (ఎయిర్‌ అట్లాంటా ఐస్‌లాండిక్‌ సంస్థకు చెందిన నెట్‌వర్క్‌ ఏవియేషన్‌) శుక్రవారం రాత్రి బయలుదేరి శనివారం వేకువ జామున చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయం కార్గో ప్రాంతంలో ల్యాండ్‌ అయింది. ఈ విమానం సుమారు 150 టన్నుల సరుకును తీసుకువచ్చింది. పాత విమానాశ్రయ టెర్మినల్‌ ప్రాంతంలోకి ఇంత పెద్ద విమానం వస్తున్న సమాచారం అందుకున్న చైన్నె ఎయిర్‌పోర్ట్‌ కంట్రోల్‌ రూమ్‌ అధికారులు వెంటనే అప్రమత్తమై, రన్‌వే వద్ద నిలిపిఉంచిన ఇతర కార్గో విమానాలను వేరే ప్రాంతానికి తరలించి ల్యాండింగ్‌కు సురక్షిత ఏర్పాట్లు చేశారు. ఇక్కడ సరుకును దించిన అనంతరం, విదేశాలకు పంపించాల్సిన సరుకును ఎక్కించుకుని ఈ విమానం చైన్నె నుంచి హాంకాంగ్‌కు ఉదయం టేకాఫ్‌ తీసుకుంది.

థాయ్‌లాండ్‌ నుండి చైనాకు పయనం..

సరిగ్గా మధ్యాహ్నం, థాయ్‌లాండ్‌లోని రాయాంగ్‌ విమానాశ్రయం నుండి సుమారు 150 టన్నుల సరుకును మోయగల మరో భారీ కార్గో విమానం చైన్నె విమానాశ్రయానికి చేరుకుంది. ఎయిర్‌పోర్ట్‌ అధికారుల ప్రత్యేక ఏర్పాట్ల మధ్య సురక్షితంగా ల్యాండ్‌ అయిన ఈ విమానం కూడా సరుకును దించి, కొత్త సరుకును ఎక్కించుకున్న తర్వాత చైనాలోని ఎహు నగర విమానాశ్రయానికి బయలుదేరింది. ఒకే రోజు అంతర్జాతీయ సరుకు రవాణాకు చెందిన రెండు అతిపెద్ద భారీ కార్గో విమానాలు చైన్నెకి వచ్చి వెళ్లడం విమానాశ్రయ సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపింది. వివిధ దేశాల మధ్య గ్లోబల్‌ కార్గో రవాణాకు చైన్నె విమానాశ్రయం ఒక ప్రధాన హబ్‌గా మారుతోందని, ఇది నగర ఆర్థిక ప్రగతికి, భవిష్యత్‌ శ్రేయస్సుకు నిదర్శనమని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement