సాక్షి , చైన్నె: తమిళనాడు జైళ్లు శాఖ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ సందీప్ రాయ్ రాథోడ్ తిరుచ్చి కేంద్ర కారాగారంలో ఆకస్మికంగా పరిశీలన జరిపారు. సెంట్రల్ జైలుతో పాటు మహిళా ప్రత్యేక జైలును సందర్శించారు. ఈ సందర్భంగా జైలు పరిపాలన, భద్రత, ఖైదీల సంక్షేమం , వారి పునరావాస కార్యక్రమాలను ఆయన క్షుణ్ణంగా సమీక్షించారు. కాగా తిరుచ్చి సెంట్రల్ జైలు ప్రాంగణంలో ఉన్న ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ తుది పరీక్షల్లో 600/600 పూర్తి మార్కులు సాధించిన ముగ్గురు ఖైదీలను డీజీపీ అభినందించి, ప్రశంసా పత్రాలు, బహుమతులు అందజేశారు. మెరుగైన భవిష్యత్తు కోసం చదువును, నైపుణ్యాభివృద్ధిని కొనసాగించాలని కోరారు.
మహిళా జైలులో క్రెచ్ ప్రారంభం
తిరుచ్చి మహిళా ప్రత్యేక జైలును సందర్శించిన డీజీపీ, తమ తల్లులతో కలిసి జైలులో ఉంటున్న చిన్న పిల్లల కోసం కొత్తగా ఏర్పాటు చేసిన క్రెచ్ (శిశు సంరక్షణ కేంద్రం) ను ప్రారంభించారు. ఇది పిల్లలకు సురక్షితమైన, అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుందన్నారు. జైలులోని బేకరీ యూనిట్, వంటగది, కూరగాయల సాగు తోటలు, ఖైదీలు చేపడుతున్న వృత్తి శిక్షణా కార్యక్రమాలను ఆయన పరిశీలించారు.మహిళా ఖైదీలు, ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న తల్లులతో మాట్లాడి వారి సంక్షేమం , ప్రాథమిక వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే జైలు అధికారులు, సిబ్బంది సమస్యలు, విన్నపాలను స్వయంగా విన్నారు. ఈ కార్యక్రమంలో తిరుచ్చి రేంజ్ డిఐజి ఆర్. రాజలక్ష్మి, జైలు సూపరింటెండెంట్ వి. రుక్మిణి ప్రియదర్శిని తదితర అధికారులు పాల్గొన్నారు.


