సాక్షి,చైన్నె : తమ కంచుకోటలైన మధురాంతకం, ధారాపురంలలో మూడో స్థానానికి పరిమితం కావడం అన్నాడీఎంకే వర్గాలను జీర్ణించుకోలేకుండా చేసింది. ఉప ఎన్నికలలో టీవీకే విజయ కేతనం ఎగుర వేయడంతో పార్టీ నుంచి వలసలు మున్ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయన్న చర్చ ఊపందుకుంది. దీనిని కట్టడి చేయడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి ఎలాంటి ప్రయత్నాలు చేస్తారో అన్న ఆసక్తి తెర మీదకు వచ్చింది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమితో మూడో స్థానంకు పరిమితమైన అన్నాడీఎంకేలో బయలు దేరిన రాజకీయ చిచ్చు గురించి తెలిసింది. సుమారు 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను దిక్కరించి బల పరీక్ష సమయంలో సీఎం విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. అదే సమయంలో పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఏకంగా తమ పదవులకు రాజీనామా చేసి టీవీకేలో చేరారు. మరి కొందరు సైతం టీవీకే లోకి చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు చర్చ జరుగుతూ వస్తోంది. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి పాలైన సీనియర్లుగా ఉన్న మాజీ మంత్రులు ఎందరో ఇప్పటికే టీవీకేలో చేరిపోయారు. కీలక నేతలు సీవీ షణ్ముగం, ఎస్పీ వేలుమణి, నత్తం విశ్వనాథన్‌తదితరులు అయితే, పళణిస్వామి వైపుగా, పార్టీ కార్యాలయం వైపుగా చూడటం మానేశారు. ఈ పరిస్థితులలలో ఉప ఎన్నికలలో తమ సిట్టింగ్ స్థానాలే కాదు, దశాబాద్దాల పాటూ కంచుకోటలుగా ఉన్న మదురాంతకం,ధారాపురంలు సైతం తాజాగా చేజారడం అన్నాడీఎంకే వర్గాల్ని తీవ్ర కలవరంలో పడేశాయి. కనీసం రెండో స్థానంలోనైనా నిలబడి ఉంటేనైనా భవిష్యత్తులో మరింతగా ముందుడుగు వేయడానికి వీలుండేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
పళనిస్వామి ఎదురుకానున్న సవాళ్లు
వరుస ఓటముల నేపథ్యంలో ఏఐఏడీఎంకేలో అంతర్గత కలహాలు తలెత్తే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంటున్నాయి. అక్టోబర్ 17న జరగనున్న అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీలో సంస్కరణల గళం వినిపించే అవకాశం ఉంది. పార్టీ నాయకులు సర్వసభ్య సమావేశం లేదా కార్యవర్గ కమిటీని ఏర్పాటు చేసి దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎడప్పాడి పళనిస్వామి ఈ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కొంటారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
మరికొందరు ఎమ్మెల్యేలు..
పార్టీకి దూరంగా ఉన్న పలువురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరవచ్చు అన్న చర్చ ఊపందుకోవడంతో పళణి స్వామి వారిని ఎలా బుజ్జగిస్తారో అన్న ప్రశ్న తెరపైకి వచ్చింది. కంచుకోట టీవీకే చేతిలోకి చేరడం, డీఎంకే రెండో స్థానంలో తమకంటే ఎక్కువ శాతం ఓట్లతో ఉప ఎన్నికలలో నిలవడంతో మున్ముందు పార్టీలో ఎలాంటి పరిణామాలు బయలు దేరుతాయో అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రెండు నియోజకవర్గాల్లో పార్టీ ఓట్ల శాతం గణనీయంగా పడిపోవడం, పార్టీలో సరైన సమన్వయం లేకపోవడం, అగ్రనేతలు ప్రచారానికి దూరంగా ఉండటం, పీఎంకే మద్దతు కూడగట్టలేకపోవడం వంటి కారణాలే ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కొందరు నేతలు చెబుతున్నారు. తాజా పరిణామాలు బట్టి చూస్తే, టీవీకేలోకి అన్నాడీఎంకే నుంచి వలసలు పెరగడం ఖాయం అన్న చర్చ జోరందుకోవడం గమనార్హం.


