చైన్నెలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలపై కొరడా | - | Sakshi
Sakshi News home page

చైన్నెలో ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలపై కొరడా

Oct 4 2026 10:07 AM | Updated on Oct 4 2026 10:07 AM

● సహకార పంట రుణాల వసూలు నిలిపివేత ● ఫోన్ల ద్వారా వేధిస్తే వాట్సాప్‌లో ఫిర్యాదు చేయండి

– ఇక, స్పాట్‌ ఫైన్లు షురూ

సాక్షి, చైన్నె: నగరంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు, ప్రాణనష్టాన్ని పూర్తిగా తగ్గించేందుకు చైన్నె ట్రాఫిక్‌ పోలీసులు అత్యంత కఠిన చర్యలకు ఉపక్రమించారు. ట్రాఫిక్‌ నిబంధనలను బేఖాతరు చేస్తూ రోడ్లపైకి వస్తున్న వాహనదారులకు షాక్‌ ఇస్తూ, స్పాట్‌ ఫైన్‌ (అక్కడికక్కడే జరిమానా) విధానాన్ని మళ్లీ అమల్లోకి తెచ్చారు. చైన్నె పోలీస్‌ కమిషనర్‌ అమల్‌రాజ్‌ ఆదేశాల మేరకు, ట్రాఫిక్‌ పోలీస్‌ అదనపు కమిషనర్‌ చాముండేశ్వరి ఈ తనిఖీలను మరింత ముమ్మరం చేశారు. ఇందు లో భాగంగా రాబోయే 10 రోజుల పాటు నగరంలోని ప్రధాన రహదారులు, రద్దీగా ఉండే జంక్షన్లు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే (బ్లాక్‌ స్పాట్స్‌) ప్రాంతాలపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచనున్నారు.

ఉల్లంఘనలపైన కొరడా :ఎలాంటి నెంబర్‌ ప్లేట్‌ లేకుండా, లేదా నిబంధనలకు విరుద్ధంగా ఫ్యాన్సీ, అస్పష్టమైన నెంబర్‌ ప్లేట్లు అమర్చి తిరిగే వాహనాలు, టూ–వీలర్లపై ముగ్గురు ప్రయాణించడం, కారు నడిపేటప్పుడు , పక్కన కూర్చునేవారు సీట్‌ బెల్ట్‌ ధరించకపోవడం, నిరుత్సాహకరంగా, వేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉల్లంఘించడం, నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే ఎలాంటి మినహాయింపు లేకుండా అక్కడికక్కడే భారీ జరిమానాలు విధించనున్నారు. వాహనదారులు అందరూ రోడ్డు భద్రతా నియమాలను తూచా తప్పకుండా పాటించి, పోలీసుల తనిఖీలకు సహకరించాలని అధికారులు కోరారు. కాగా, ఇది వరకు పోలీసులు స్పాట్‌ ఫైన్లను కొంత కాలం పక్కన పెట్టి ఈ చలాన్ల రూపంలో జరిమానా విధిస్తూ వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఈ చలాన్లను చెల్లించకుండా వాహనదారులు తప్పించుకుంటూ వస్తున్నారు. ఈ చలాన్ల బకాయిలు పెద్ద ఎత్తున పేరుకు పోతున్నాయి. ఈ దృష్ట్యా, మళ్లీ స్పాట్‌ ఫైన్‌ చలాన్‌ విధానం అమలులోకి తెచ్చారు.

కండక్టర్లు లేచి వెళ్లి టిక్కెట్లు ఇవ్వాలి

– రవాణా సంస్థ సూచన

కొరుక్కుపేట: తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వ బస్సుల్లో మహిళలు, బాలికలు, ట్రాన్స్‌జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పించే పథకాన్ని ముఖ్యమంత్రి విజయ్‌ శుక్రవారం ప్రారంభించారు. దీంతో ఇప్పుడు ఏసీ బస్సులు మినహా అన్ని బస్సుల్లో ప్రయాణించడం సాధ్యమవుతుంది. ఈనేపథ్యంలో ప్రభుత్వ బస్సుల్లో రద్దీ పెరిగే అవకాశం ఉంది. ప్రయాణికులతో ఎలా ప్రవర్తించాలనే దానిపై రవాణా సంస్థ అధికారులు బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు సూచనలు జారీ చేశారు. ముఖ్యంగా కండక్టర్లు కూర్చుని ప్రయాణికులకు టిక్కెట్లు ఇవ్వకూడదు. వారు ఉన్న చోటుకే వెళ్లి టిక్కెట్లు ఇవ్వాలి. స్వేచ్ఛాయుత ప్రయాణం పట్ల ఎలాంటి ఉదాసీనత ఉండకూడదు. ప్రయాణికులు మాట్లాడకూడదని, బస్సు ఎక్కిన తర్వాత, దిగిన తర్వాత తలుపులు మూసివేయాలని సూచించారు. ఈ విషయ మై చైన్నె మెట్రోపాలిటన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ అధికారి మాట్లాడుతూ నగర బస్సులను పక్కన నిలిపి, ప్రయాణికులను ఎక్కించుకోవడం, దించడం చేయాలని కండక్టర్లు, డ్రైవర్లకు సూచించారు. ఈ పనిలో 7,000 మంది పాల్గొంటున్నారు. వారి కోసం 4 కేంద్రాలలో శిక్షణా కోర్సులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో మహిళా ప్రయాణికులతో ట్రాన్స్‌పోర్టు సిబ్బంది కఠినంగా ప్రవర్తించవద్దని సూచించినట్లు వెల్లడించారు.

రైతన్నలకు శుభవార్త

సాక్షి, చైన్నె: రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాల ద్వారా రైతులు తీసుకుని, బకాయిపడిన పంట రుణాల వసూలు ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు సహకార శాఖ అధికారికంగా ప్రకటించింది.ఈ మేరకు సహకార సంఘాల రిజిస్ట్రార్‌ జోనల్‌ రిజిస్ట్రార్లు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల మేనేజింగ్‌ డైరెక్టర్లకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని సహకార సంఘాలు ఈ నిబంధనను కచ్చితంగా పాటించాలని ఆదేశాలు అందాయి.

రుణ వసూళ్లకు బ్రేక్‌: సహకార సంఘాల నుంచి రైతులు తీసుకున్న బకాయి పంట రుణాలను ప్రస్తుతం ఎలాంటి ఒత్తిడి చేసి వసూలు చేయకూడదని తాత్కాలికంగా నిలిపివేశారు. పంట రుణాల బకాయిల కోసం కొంతమందిని ఫోన్ల ద్వారా సంప్రదించి వసూలు చేయడానికి ప్రయ త్నిస్తున్నట్లు రైతుశ్రేణుల నుంచి ఫిర్యాదులు అందాయి. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా రైతులను రుణ వసూళ్ల కోసం ఫోన్‌ ద్వారా సంప్రదిస్తే, ఆ మొబైల్‌ నంబర్‌, సహకార సంఘం వివరాలతో సహకార శాఖ అధికారిక వాట్సాప్‌ నంబర్‌ 98840 00845కు ఫిర్యాదు చేయవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది. రుణ వసూళ్ల నిలిపివేతపై రైతులు ఎవరు కూడా ఆందోళన చెందవద్దని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.

సచివాలయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement