సాక్షి, చైన్నె : తమిళనాడులోని ప్రముఖ అంతర్జాతీయ ఆధ్యాత్మిక నగరమైన రామేశ్వరానికి త్వరలోనే కొత్త విమానాశ్రయం రానుంది. రామనాథపురం, శివగంగ జిల్లాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. రామనాథస్వామి ఆలయం, ధనుష్కొడి, అరిచాల్‌మునై, అలాగే భారతరత్న డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం స్మారక చిహ్నాన్ని దర్శించేందుకు రోజూ వేలాది మంది దేశవిదేశీ యాత్రికులు ఇక్కడికి వస్తుంటారు. అయితే ఇప్పటివరకు మదురైకి విమానంలో చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు లేదా రైలు మార్గంలో రామేశ్వరానికి ప్రయాణించాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులకు త్వరలోనే తెరపడనుంది.
ప్రభుత్వ చొరవ: దక్షిణ తమిళనాడులోని జిల్లాల ఆర్థిక అభివృద్ధిని, పర్యాటకాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో గత డీఎంకే హయంలో 2025లోనే రామేశ్వరంలో కొత్త విమానాశ్రయ నిర్మాణ ప్రణాళికను ప్రకటించారు. రామనాథపురం జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటు కోసం మొదట పాలన్‌కుళం, దేవిపట్టినం, కుంబరం, కలరి మరియు మణికనేరి అనే ఐదు ప్రాంతాలను అధికారులు అధ్యయనం చేశారు. ఆ ప్రాంతాల భౌగోళిక పరిస్థితులు, భూభాగం , ప్రయాణ సౌలభ్యం ఆధారంగా తుది పరిశీలన జరిపి కుంబరం, మణికనేరి ప్రాంతాలను అనువైనవిగా తాజాగా టీవీకే ప్రభుత్వం నిర్ణయించడం గమనార్హం. ఈ పనులపై సీఎం విజయ్ ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి, పనుల వేగానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఉన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి..ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే చైన్నె, బెంగళూరు, ఢిల్లీ వంటి సుదూర నగరాల నుంచి భక్తులు, పర్యాటకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నేరుగా రామేశ్వరానికి చేరుకోవడానికి మార్గం సుగమమం కానుంది. అంతేకాకుండా విదేశాల్లో స్థిరపడిన ఈ ప్రాంత వాసుల ప్రయాణ కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోనున్నాయి. రామనాథపురం అభివృద్ధి పరంగా మరింత ముందుకు సాగడంతో ఉపాధి అవకాశాలు మెరగు పడనున్నాయి.
రామేశ్వరం ఆలయం


