సాక్షి, చైన్నె: దేశంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ పేరుతో కోట్ల మంది ఓట్లను తొలగించడాన్ని నిరసిస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇండియా తమిళనాట సమరానికి సన్నద్ధమైంది. ఇందులో భాగంగా తమిళనాడులో భారీ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వివరాలు.. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో చైన్నెలోని సత్యమూర్తి భవనన్‌లో ఇండియా కూటమి పార్టీల అత్యున్నత స్థాయి సంప్రదింపుల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు.. అక్టోబర్ 13, 14 తేదీలలో రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో, అలాగే అక్టోబర్ 15న చైన్నెలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ అధికారికంగా ప్రకటించింది.
తీర్మానాలు ఇవే..
ఇండియా కూటమిలోకి కొత్తగా చేరిన తమిళనాడు వెట్రి కళగం(టీవీకే)కు మిత్ర పక్షాల నేతలు ఆహ్వానం పలికారు. టీవీకే అధ్యక్షుడు, సీఎం విజయ్‌ను సమావేశం ప్రత్యేకంగా అభినందించింది. ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో దాదాపు 13 కోట్ల మంది అర్హులైన ఓటర్ల ఓటు హక్కును హరిస్తూ, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 13, 14: తమిళనాడులోని అన్ని జిల్లా రాజధానులలో ప్రజాస్వామ్యాన్ని కాపాడండి నినాదంతో నిరసన ప్రదర్శనలు నిర్వహించేందుకు తీర్మానించారు. అలాగే అక్టోబర్ 15న చైన్నెలో ఇండియా కూటమి నేతలందరి భాగస్వామ్యంతో అత్యంత భారీ నిరసన ప్రదర్శనకు నిర్ణయించారు. అలాగే, భారత ప్రజాస్వామ్యాన్ని విపత్తు నుండి కాపాడటానికి జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలు, ఏకాభిప్రాయం కలిగిన రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజ ప్రతినిధులతో సహా ప్రతి ఒక్కరూ పాల్గొని తమ మద్దతును అందించాలని కోరారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఈ పోరాటంలో అన్ని వర్గాల ప్రజలు, పౌర సమాజ ప్రతినిధులు పెద్దఎత్తున పాల్గొని మద్దతు ఇవ్వాలని ఇండియా కూటమి నాయకులు పిలుపునిచ్చారు. చైన్నెలోని సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఈ సమావేశానికి తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణికం ఠాకూర్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఎండీఎంకే ప్రధాన కార్యదర్శి వైగో, టీవీకే తరఫున మంత్రులు ఆధవ్ అర్జున, మరియా విల్సన్, వీసీకే అధ్యక్షుడు తిరుమావళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ తరఫున రవీంద్రనాథ్ తదితర కూటమి పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు.


