కుంభకోణంలో 14 దివ్య దేశాల సందర్శన | - | Sakshi
Sakshi News home page

కుంభకోణంలో 14 దివ్య దేశాల సందర్శన

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● ప్రత్యేక ఆధ్యాత్మిక బస్సు సర్వీసు ప్రారంభం

సాక్షి, చైన్నె: వైష్ణవ భక్తుల కోసం తమిళనాడు రాష్ట్ర రవాణా శాఖ సరికొత్త ఆధ్యాత్మిక పర్యాటక సర్వీసుకు శ్రీకారం చుట్టింది. తంజావూరు జిల్లా కుంభకోణం పరిసర ప్రాంతాల్లోని ప్రముఖ 14 దివ్య దేశ దేవాలయాలను ఒకే రోజులో దర్శించుకునేలా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధ్యాత్మిక టూర్‌ బస్సు సర్వీసును శనివారం ప్రారంభించారు. కుంభకోణం కొత్త బస్టాండ్‌లో నిర్వహించిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా సంస్థ కుంభకోణం డివిజనల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ దక్షిణామూర్తి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ జనరల్‌ మేనేజర్‌ సింగరవేలు, జనరల్‌ మేనేజర్‌ నటరాజన్‌, బిజినెస్‌ మేనేజర్‌ రాజమోహన్‌ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ తొలి టూర్‌లో తమిళనాడులోని వివిధ జిల్లాల నుండి 52 మంది భక్తులు ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. ప్రతి శని , ఆదివారాల్లో ఈ బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుంది. ఉదయం సరిగ్గా 5 గంటలకు కుంభకోణం బస్టాండ్‌ నుండి బయలుదేరి, రాత్రి 8 గంటలకు తిరిగి అక్కడికే చేరుకుంటుంది. ఒక్కో వ్యక్తికి ప్రయాణ ఛార్జీ రూ. 1,350 గా నిర్ణయించారు.

సందర్శించే ప్రధాన ఆలయాలు: సిర్కాళి తడలన్‌ పెరుమాళ్‌ ఆలయం, అన్నన్‌ కోవిల్‌, తిరునగరి కళ్యాణ రంగనాథ పెరుమాళ్‌ ఆలయం, తిరుమణికూడం వరదరాజ పెరుమాళ్‌ ఆలయం, తిరునంగూర్‌ వైకుంఠనాథర్‌ ఆలయం, పొన్పురుషోత్తమ ఆలయం , వనపురుషోత్తమ ఆలయం, పల్లికొండ పెరుమాళ్‌ ఆలయం, కుడమేడు కూతర్‌ ఆలయం, నారాయణ పెరుమాళ్‌ ఆలయం, తిరుయిందలూర్‌ పరిమళ రంగనాథర్‌ ఆలయం, సెంగనూర్‌ శ్రీనివాస పెరుమాళ్‌ ఆలయం, నాచియార్కోవిల్‌ శ్రీనివాస పెరుమాళ్‌ ఆలయం , కుంభకోణం సారంగపాణి స్వామి ఆలయం వంటి మొత్తం 14 దివ్య దేశాలను ఈ బస్సు ద్వారా భక్తులు సులభంగా దర్శించుకోవచ్చు. ఒకే రోజులో ఇన్ని దివ్య దేశాలను సందర్శించే అవకాశం కల్పించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement