తమిళసినిమా: తమిళ సినిమాలో అష్టావధానిగా పేరుందిన దర్శకుడు టి.రాజేందర్. కథానాయకుడు, దర్శకుడు, నిర్మాత, కథకుడు, గాయకుడు, గీత రచయిత ,సంగీత దర్శకుడు, ఛాయాగ్రాహకుడు ఇలా పలు శాఖల్లో నిష్ణాతుడైన ఈయన శనివారం 71వ వసంతంలోకి అడుగు పెట్టారు. గత అర్ధ శతాబ్ద కాలంగా చిత్ర పరిశ్రమకు తన సేవలను అందిస్తున్న టి. రాజేందర్ పేదలకు పలు సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు. శనివారం తన తన పుట్టినరోజు సందర్భంగా పలువురు పేదలకు బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు అభిమానులు ఆయనకు నేరుగా శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా టి. రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ తన సినీ పయనంలో ఎన్నో అవమానాలను, ఆటంకాలను, పరిహాసాలను ఎదుర్కొన్నాను అని పేర్కొన్నారు. భగవంతుడు మనకు రెండు చెవులు ఇచ్చాడు. విమర్శలను, ఆరోపణలను ఒక చెవి ద్వారా విని మరో చెవి ద్వారా వదిలేయాలనీ, మంచిని మాత్రమే తీసుకోవాలి అన్నారు. జీవితంపై నమ్మకాన్ని మాత్రం పెంపొందించుకోవాలని, అప్పుడే విజయాన్ని అందుకోగలరని అన్నారు. తాను ఖాళీ చేతులతో రైలు ఎక్కి చైన్నెకి చేరుకున్నానని, తనకు భగవంతుడు ధనం ఇస్తున్నారని తాను నిరుపేదలకు దానం చేస్తున్నానని చెప్పారు. ప్రేమను పంచుదామని, ఉన్నదానిలో కొంత దానం చేద్దామని టి రాజేందర్ పేర్కొన్నారు. కాగా ఈయన ప్రస్తుతం కన్నడత్తు పైంగిళి అనే చిత్రానికి పాటలు రాసి సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి రమణి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సంగీత దర్శకుడు ఇళయరాజా ఒక పాట పాడటం విశేషం. కాగా ఆరోగ్య రీత్యా ఇటీవల అమెరికా వెళ్లి వచ్చిన తాను తన తదుపరి చిత్రంపై దష్టి సారిస్తున్నట్లు టి. రాజేందర్ పేర్కొన్నారు.


