డబ్బులు ఇవ్వకుండా టపాసులు కొంటే వేటే! | - | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇవ్వకుండా టపాసులు కొంటే వేటే!

Oct 4 2026 10:01 AM | Updated on Oct 4 2026 10:01 AM

● పోలీసులకు విరుదునగర్‌ ఎస్పీ గట్టి హెచ్చరిక!

సాక్షి, చైన్నె : దీపావళి పండుగ వస్తోందంటే చాలు బాణసంచా రాజధానిగా పేరుగాంచిన శివకాశిలో హడావుడి మామూలుగా ఉండదు. అయితే పండుగ వేళ కొందరు పోలీసులు నిబంధనలను అతిక్రమించి ఉచితంగా పటాకులు తీసుకుంటున్నారనే ఆరోపణలపై విరుదునగర్‌ జిల్లా ఎస్పీ గౌతమ్‌ గోయల్‌ సంచలన హెచ్చరికలు జారీ చేశారు. డబ్బులు చెల్లించకుండా ఎవరైనా బాణసంచా కొనుగోలు చేస్తే శాఖాపరమైన కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. విరుదునగర్‌ జిల్లాలోని శివకాశి పరిసర ప్రాంతాలలో వెయ్యికి పైగా బాణసంచా కర్మాగారాలు, సుమారు 1,500లకు పైగా టపాసుల దుకాణాలు నడుస్తున్నాయి. ఏటా దీపావళి సమయంలో పోలీస్‌ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది, అధికారులు దుకాణాలు, ఫ్యాక్టరీల నుంచి ఎలాంటి నగదు చెల్లించకుండానే పటాకులు, ఖరీదైన గిఫ్ట్‌ బాక్సులు తీసుకుంటున్నారంటూ పోలీసులకు నిరంతరం ఫిర్యాదులు అందుతున్నాయి. పోలీస్‌ అధికారులు, కానిస్టేబుళ్లు తమ అధికారిక హోదాను అడ్డంపెట్టుకుని దుకాణదారులను ఇబ్బంది పెట్టకూడదని ఎస్పీ హెచ్చరించారు. ఫ్యాక్టరీలు లేదా దుకాణాల నుంచి ఎవరైనా సరే బాణసంచా కొనుగోలు చేస్తే, సాధారణ పౌరుల మాదిరిగానే కచ్చితంగా డబ్బులు చెల్లించాల్సిందేనని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా ఉచితంగా టపాసులు తీసుకున్నట్లు తేలితే వారిపై కఠినమైన శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఎస్పీ హెచ్చరించారు. పోలీస్‌ శాఖ గౌరవాన్ని కాపాడేలా, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ నిబంధనను అందరూ కచ్చితంగా పాటించాలని ఆయన ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement