సాక్షి, చైన్నె:ఆదాయానికి మించిన ఆస్తుల కేసుకు సంబంధించి మాజీ మంత్రి, డీఎంకే సీనియర్ నేత ఎం.ఆర్.కె. పన్నీర్‌సెల్వం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను, తన కుటుంబాన్ని ఈ కేసు నుంచి నిర్దోషులుగా విడుదల చేయాలని కోరుతూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన సుప్రీంకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. 2006 నుంచి 2011 వరకు డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేసిన కాలంలో, తమ ఆదాయానికి మించి సుమారు రూ. 3 కోట్ల విలువైన అక్రమ ఆస్తులను కూడబెట్టారన్న ఆరోపణలపై ఎం.ఆర్.కె. పన్నీర్‌సెల్వం, ఆయన భార్య , కుమారులపై అవినీతి నిరోధక శాఖ కేసు నమోదు చేసింది. ఈ కేసును విచారించిన కడలూరు జిల్లా కోర్టు మొదట వారిని నిర్దోషులుగా విడుదల చేసింది. అయితే దీనిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు.. దిగువ కోర్టు తీర్పును రద్దు చేసింది. కాగా ఆ తర్వాత కేసు నుంచి తమను డిశ్చార్జ్ చేయాలని కోరుతూ పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కడలూరు కోర్టు, ఆపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక ధర్మాసనం కూడా కొట్టివేశాయి. హైకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగలడంతో, ఆయన తాజాగా తుది పోరాటంగా సుప్రీంకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ త్వరలోనే సుప్రీం కోర్టులో విచారణకు రానుంది.


