ఘాట్లన్నీ వెలవెల
పవిత్ర స్నానాల కోసం తిరుచ్చిలో ప్రత్యేక చర్యలు
కొలనులు, చెరువుల వద్ద పూజలు
సాక్షి, చైన్నె : ఆడిమాసం(ఆషాడం)లో తమిళనాడు అత్యంత భక్తి భావం మునుగుతుంది. అమ్మవారి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించడం జరుగుతోంది. గ్రామగ్రామాల్లో, వీధి వీధిన కొలువు దీరిన అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. అభిషేకాది పూజలతో, అంబలి పోసి, పొంగళ్లు పెట్టి, భక్తిభావంతో అమ్మవార్లను కొలుస్తుంటారు. ఆడి అమావాస్య రోజున పితృదేవుళ్లకు తర్పణాలు పెట్టి వారి ఆత్మల శాంతికి ఆకాంక్షిస్తుంటారు. అలాగే, ఈ నెలంతా ప్రతి మంగళ, శుక్ర, ఆదివారాల్లో ఇంటింటా పూజలతో భక్తి పారవశ్యం మిన్నంటడం ఆనవాయితీ. ఆ దిశగా ఈ మాసంలో పదిహేడు రోజులు సాగాయి. ఇక, ఆడి 18 వ రోజును కీలకంగా భావిస్తారు. ఆడి పెరుక్కు పేరుతో ఈ రోజును నదీ తీరాల్లో అత్యంత కోలాహలం, పవిత్ర స్నానాలతో జరుపుకోవడం ఆనవాయితీ. వాస్తవానికి గత ఐదేళ్లుగా కావేరి నదీ తీరంలో అత్యంత వేడుకగా ఈ ఆడి పెరుక్కును జరుపుకోవడం జరిగింది. ఇందుకు కారణం కావేరి పరవళ్లు తొక్కడమే. అయితే, ఈ ఏడాది కళ తప్పినట్టైంది. ఇందుకు కారణంకావేరిలో నీళ్లు కరువు కావడమే. అయినా, భక్తితో పూజలలో ప్రజలు లీనమయ్యారు. మేట్టూరు జలాశయంలో నీటి కరువుతో కావేరీ తీరంలో ఆడిపెరుక్కును పురస్కరించుకుని భక్తులు గుంటలు తీసి, ఊట నీటిలో పూజలలో లీనమయ్యారు. సేలం, ఈరోడ్డు, నామక్కల్, తిరుచ్చి,ధర్మపురి, కృష్ణగిరిల్లో ఆడి పెరుక్కు పూజలు జరిగాయి. తిరుచ్చి శ్రీరంగం అమ్మ మంటపం ఘాట్, కుడమురుట్టి అయ్యాలమ్మన్ ఘాట్, ఓడత్తురై అత్రళగియ సింగర్ ఘాట్ తదితర కావేరి తీర ఘాట్ల గుండా ప్రజలు నది లోపలికి దిగారు. వాగులా పారే కొద్దిపాటి నీటి ఒడ్డున, మరికొన్ని చోట్ల గుంటలు తవ్వి ఊట నీటితో కావేరి తల్లికి పూజలు చేశారు. తంజావూరు, తిరువారూర్, తిరువయ్యారు ఘాట్లు అన్నీ వెల వెలబోయాయి. ఆ పరిసరవాసులు తరలి వచ్చి పూజలు చేశారు.
పూజలతో సరి..
ఉదయాన్నే నవ దంపతులు, కుటుంబాలు, యువతీ, యువకులు, పిల్లలు , అన్నదాతలు కొంత మేరకు కావేరి తీరానికి తరలివచ్చారు. కావేరి తల్లికి కృతజ్ఞతలు తెలుపుతూ పూజాధి కార్యక్రమాలు చేశారు. మహిళలు, నవదంపతులు గాజులు, బియ్యం, పసుపు కుంకుమలు, తమల పాకులను కళశాల మధ్య ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే పలు రకాల ఫలాలను ఉంచి మొక్కులు తీర్చుకున్నారు. కర్పూర నీరాజనాలు సమర్పించారు. నవ దంపతులు తమ వివాహ సందర్భంగా ఉపయోగించిన పూల మాలల్ని తీసుకొచ్చి కావేరి నదిలో కలిపేశారు. అన్నదాతలు విత్తనాల్ని, గత ఏడాది తమ చేతికి అందిన పంటల్ని కావేరి నదీ తీరంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం ఆ పరిసరాల్లోని గ్రామదేవతల ఆలయాల్ని సందర్శించి మొక్కులు తీర్చుకున్నారు. పెళ్లి కాని కన్యలు, యువకులు పసుపు తాడును కావేరి తీరంలో కలశాల మధ్యలో ఉంచి పూజలు చేశారు. తమ కుటుంబాలు సుభిక్షంగా ఉంటాయని, మాంగళ్య బలం గట్టిగా ఉంటుందని, పెళ్లి కాని వారికి పెండిళ్లు అవుతాయని, పంటల దిగుబడి పెరుగుతుందన్న నమ్మకంతో ప్రజలు ఈ పూజలు చేయడం విశేషం. అలాగే, ఇతర ప్రాంతాల్లోని ప్రజలు తమ ఇళ్లల్లో పూజలు జరుపుకున్నారు. అలాగే, తమ పరిసరాల్లోని కొలనులు, చెరువులు, నీటి ప్రవాహ ప్రాంతాల్లోకి వెళ్లి పూజలు చేసుకున్నారు. కావేరిలో నీరు కరువైనా తెన్ పైన్నె నదిలో నీటి ప్రవాహంతో కృష్ణగిరి, ధర్మపురి, తిరువణ్ణామలై, తిరుపత్తూరు జిల్లాలోని ఆ నదీ తీర గ్రామాలలో మాత్రం కొంతమేరకు ఆడిపెరుక్కు కళకళలాడింది.
కావేరి తీరంలో కళ తప్పిన పూజలు


