– డస్టర్ కారు నడిపిన సీఎం విజయ్
సాక్షి, చైన్నె : సీఎం విజయ్ సోమవారం కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు , ఒరగం పారిశ్రామికవాడలలో క్షేత్రస్థాయి పర్యటన చేశారు. ఇక్కడి పరిశ్రమలను, పనితీరును పరిశీలించారు. కార్మికులతో మాట్లాడారు. డస్టర్ కార్‌ను స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు. ముందుగా ఆయన మాంబాక్కంలోని సెయింట్–గోబైన్ గ్లాస్ ఫ్యాక్టరీలో ప్రపంచ స్థాయి గాజు తయారీ కర్మాగారాన్ని సందర్శించారు. ఇక్కడ జరుగుతున్న ఉత్పత్తి, విస్తరణ కార్యకలాపాలను వీక్షించారు. అనంతరం ఒరగడంలోని డైమ్లర్ ఇండియాను సందర్శించారు. అలాగే, ఒరగడంలో ఉన్న భారీ తయారీ ప్లాంట్‌లైన భారత్‌బెంజ్, మెర్సిడెస్–బెంజ్ బస్సులు , ఛాసిస్ , రెనాల్ట్ కార్ల తయారీ విభాగాలను పరిశీలించారు. ఈసందర్భంగా రెనాల్ట్ డస్టర్ కారును ఆయన స్వయంగా నడుపుకుంటూ వెళ్లారు. ఆయా పరిశ్రమలలోని కార్మికులతో ముచ్చటించారు. పలువురు తమ సమస్యలను సీఎం విజయ్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. కార్మికులతో పోటోలు దిగారు. అలాగే, ఆయా పరిశ్రమల ప్రాంగణాలలోమొక్కలను నాటారు. ఈ పర్యటన సందర్భంగా నీలాంగరై నుండి శ్రీపెరంబుదూర్–ఒరగడం మార్గంలో భారీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యే మార్కండేయన్‌కు బెయిల్
సాక్షి, చైన్నె: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై అరెస్టయిన విళాత్తికుళం డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయనన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మద్రాస్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను బెదిరించారనే కేసులో విళాత్తికుళం డీఎంకే ఎమ్మెల్యే జి.వి. మార్కండేయన్‌ను తూత్తుకుడి జిల్లా నేరవిభాగం పోలీసులు జులై 20న అరెస్టు చేశారు. తనను రిమాండ్‌కు పంపుతూ తూత్తుకుడి కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవా లు చేస్తూ మార్కండేయన్ దాఖలు చేసిన పిటిషన్ పై తీర్పును మద్రాస్ హైకోర్టు తేదీని పేర్కొనకుండా వాయిదా వేసింది. ఈక్రమంలో, బెయిల్ కోరు తూ మార్కండేయన్ దాఖలు చేసిన పిటిషన్‌ను తూత్తుకుడి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు తిరస్కరించింది. దీంతో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మార్కండేయన్ తరఫున మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇది జస్టిస్ జి.కె. ఇళందిరైయన్ ఎదుట సోమవారం విచారణకు వచ్చింది. మార్కండేయన్ తరఫు సీనియర్ అడ్వకేట్ విల్సన్ , పోలీసుల తరఫున హాజరైన పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాన్ సత్యన్ వాదనలు వినిపించారు. ఆగస్టు 5 నుండి శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నందున, ఇకపై ఇలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన వద్ద నుంచి హామీ పత్రం తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వవచ్చని కోర్టుకు తన వాదన సమయంలో జాన్ సత్యన్ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి మార్కండేయన్‌కు బెయిల్ మంజూరు చేశారు. శాసనసభ సమావేశాలు జరిగే రోజులు మినహా, మిగిలిన రోజుల్లో రెండు వారాల పాటు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరై సంతకం చేయాలని ఆదేశించారు.
శోక సంద్రంలో డెల్టా!
– స్టాలిన్ తీవ్ర ఆగ్రహం
సాక్షి, చైన్నె : ‘జూన్ 12న రావాల్సిన కావేరి నీరు ఆగస్టు నెల వచ్చినా రాలేదు.. ఆడి 18న పొంగిపొర్లే నూతన ప్రవాహాన్ని ఆహ్వానించే కావేరి తీరపు బిడ్డలకు ఈ పాలనలో మిగిలింది శోకమేనని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం ఆయన స్పందిస్తూ, కావేరి రైతుల కోసం ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ నాయకత్వంలో డీఎంకే తంజావూరులో వేలాదిగా తరలివచ్చిందన్నారు. రైతాంగం డిమాండ్లను నెరవేర్చకపోతే పోరాటం ఉధృతమవుతుందని హెచ్చరించారు. కావేరి పొంగిపొర్లాల్సిన ఆడిప్పెరుక్కు రోజున డెల్టా రైతులు ఆవేదనతో పోరాడుతున్నారన్నారు. తమిళనాడుకు నీటిని విడుదల చేసేందుకు నిరాకరిస్తున్న కర్ణాటక ప్రభుత్వాన్ని ఖండిస్తూ ఒక్క మాట కూడా మాట్లాడని సీఎంను తమిళనాడు ఇప్పుడే చూస్తోందన్నారు. పొరుగు రాష్ట్రంలో సినిమా ప్రదర్శన కోసం తమిళ రైతుల జీవితాలను తాకట్టు పెడతా రా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. పూర్తి రుణమాఫీ అని తీపి హామీ ఇచ్చి గెలిచి, ఆ తర్వాత రైతులను మోసం చేసిన వంచన ప్రభుత్వంగా ఈ టీవీకే మారిందన్నారు. మేఘ దాతు వద్ద ఆనకట్ట నిర్మించి తీరుతామన్న కర్ణాటకతో చర్చలకు వెళ్లేందుకు తహతహలాడుతున్న తమిళనాడు సీఎం కర్ణాటకలో జరిగిన అఖిల పక్షం సమావేశం వార్తలను చూశారా? ఇక్కడ కూడా అదే విధంగా ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు సమయం లేదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులను విస్మరించి, వ్యవసాయ బడ్జెట్‌ను తిరుపతికి మోసుకెళ్తే పాపాలు తొలగిపోతాయా? అని మండిపడ్డారు.


