సాక్షి,చైన్నె : కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించి తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. కావేరీ నీటి నిర్వహణ అథారిటీ , కావేరీ నీటి క్రమబద్ధీకరణ కమిటీ ఆదేశాలను కర్ణాటక ప్రభుత్వం పాటించడం లేదని, వెంటనే తమిళనాడుకు రావాల్సిన నీటిని విడుదల చేసేలా ఆదేశించాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఏడాది జూలై 29 నుండి ఆగస్టు 12 వరకు (15 రోజుల పాటు) బిల్లిగుండ్లు వద్ద రోజుకు సెకనుకు 3,500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని కర్ణాటకకు కావేరి యాజమాన్యాలను కమిటీ ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని జూలై 30న జరిగిన అత్యవసర సమావేశంలో కావేరీ అథారిటీ కూడా సమర్థించింది. కమిటీ ఆదేశించినప్పటికీ, కర్ణాటక జూలై 29 నుండి ఆగస్టు 2 మధ్య కాలంలో బిల్లిగుండ్లు వద్ద కేవలం 158 నుండి 550 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేసిందని తమిళనాడు ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది.
రిజర్వాయర్లలో సంవృద్ధిగా నీరు
ఆగస్టు 3 నాటి లెక్కల ప్రకారం కర్ణాటకలోని ప్రధాన జలాశయాలైన కేఆర్‌ఎస్ (23.078టీఎంసీ), కబిని (18.610 టీఎంసీ), హారంగి (7.827టీఎంసీ), హేమావతి (28.022 టీఎంసీ ) లలో కలిపి మొత్తం 77.537 టీఎంసీల నీటి నిల్వలు ఉన్నాయని వివరించారు. నీటి నిల్వలు పుష్కలంగా ఉన్నందున, నిష్పత్తి ఆధారంగా తమిళనాడుకు నీటిని విడుదల చేయడంలో కర్ణాటకకు ఎలాంటి ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. కావేరీ క్యాచ్‌మెంట్ ఏరియాలో వర్షాలు పెరగడంతో నిష్పత్తి ప్రకారం తమకు 26.954 టీఎంసీల నీరు రావాల్సి ఉందని, కానీ కావేరీ అథారిటీ ఆదేశించిన 4.536 టీఎంసీల నీరు కూడా అందలేదని ఆరోపించింది.
సీఎం విజయ్ ఆదేశాలతో చర్యలు
కర్ణాటక వైఖరి వలన తమిళనాడు రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నందున, సీనియర్ న్యాయవాదుల సలహా మేరకు ముఖ్యమంత్రి విజయ్ ఆదేశాల మేరకు సోమవారం సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసినట్లు తమిళనాడు ప్రభుత్వ అధికారిక ప్రకటన తెలిపింది. తమ వాటా నీటిని సకాలంలో పొందేందుకు న్యాయపోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది.


