వైద్య విద్యార్థులకు.. అన్యాయం | - | Sakshi
Sakshi News home page

వైద్య విద్యార్థులకు.. అన్యాయం

Jul 10 2026 5:40 AM | Updated on Jul 10 2026 5:40 AM

● కేంద్రంపై మాణిక్యం ఠాగూర్‌ ఫైర్‌

సాక్షి,చైన్నె: నీట్‌ పరీక్ష వివాదాలు ముగియకముందే, విదేశాలలో వైద్య విద్య చదివిన భారతీయ విద్యార్థుల అర్హత పరీక్ష విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయానికి ఒడిగడుతోందని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు మానిక్కం ఠాగూర్‌ తీవ్రంగా మండిపడ్డారు. పరీక్ష రోజే నిబంధనలు , పరీక్ష విధానాన్ని మార్చడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవడమేనని ఆయన ధ్వజమెత్తారు.

అత్యంత స్వల్పంగా ఉత్తీర్ణత శాతం

భారతదేశంలో వైద్యులుగా ప్రాక్టీస్‌ చేయాలనుకునే విదేశీ మెడికల్‌ గ్రాడ్యుయేట్ల కోసం జూన్‌ 28న దేశవ్యాప్తంగా ’ఎఫ్‌.ఎమ్‌.జి.ఇ’ పరీక్ష నిర్వహించారు. దీని ఫలితాలను నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఇటీవల విడుదల చేసింది. ఈ పరీక్షకు దేశవ్యాప్తంగా మొత్తం 37,448 మంది వైద్య గ్రాడ్యుయేట్లు హాజరుకాగా, వారిలో కేవలం 4,635 మంది (అంటే కేవలం 12.38 శాతం) మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. గత మూడేళ్లలో నమోదైన అత్యల్ప ఉత్తీర్ణత శాతం ఇదే కావడం గమనార్హం.

పరీక్ష రోజే నిబంధనల మార్పుపై అభ్యంతరం

ఈ దారుణ ఫలితాలపై స్పందిస్తూ మానిక్కం ఠాగూర్‌ గురువారం స్థానికంగా మాట్లాడుతూ ‘ప్రవేశ పరీక్షల పేరుతో పేద, మధ్యతరగతి, గ్రామీణ ప్రాంత విద్యార్థుల డాక్టర్‌ కలలను మోదీ ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు. పరీక్షా విధానంలో వీడియో ఆధారిత ప్రశ్నలు, క్లిష్టమైన ప్రాక్టికల్‌ ప్రశ్నలను ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అకస్మాత్తుగా ప్రవేశపెట్టారని వివరించారు. విద్యార్థులు ఈ మార్పులకు సిద్ధమవడానికి తగిన సమయం ఇవ్వకుండా, పరీక్ష రోజే నిబంధనలు మార్చడం మోదీ ప్రభుత్వ నిరంకుశ ధోరణికి అద్దం పడుతోందని ఆయన విమర్శించారు.

పునఃసమీక్షకు డిమాండ్‌

అనేక కుటుంబాలు అప్పులు చేసి మరి తమ పిల్లలను విదేశాల్లో చదివించాయని, ఇప్పుడు వారిని దేశంలో సేవ చేయకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తక్షణమే ఈ పరీక్షా విధానంపై పారదర్శకమైన పునఃసమీక్ష జరపాలని, ఈ ఏడాదికి కట్‌–ఆఫ్‌ మార్కులను (అర్హత మార్కులు) తగ్గించాలని మానిక్కం ఠాగూర్‌ డిమాండ్‌ చేశారు. బాధితులైన మెడికల్‌ విద్యార్థుల హక్కుల కోసం కాంగ్రెస్‌ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement