సాక్షి, చైన్నె : అక్రమ ఇసుక రవాణాను అడ్డుకుని, ట్రాక్టర్‌ను పోలీసు స్టేషన్‌కు తరలిస్తుండగా జరిగిన ప్రమాదంలో రామనాథపురం హెడ్ కానిస్టేబుల్ ఎం. మహేష్‌కుమార్ (41) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ సమాచారంతో సీఎం విజయ్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన కుటుంబానికి రూ.30 లక్షలుఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. వివరాలు.. రామనాథపురం జిల్లా కొప్పెరిమడం ప్రాంతంలో అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుతో దేవిపట్టణం పోలీస్ స్టేషన్ సబ్–ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం సోమవారం వేకువ జామున తనిఖీలలో నిమగ్నమయ్యాయి. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాహనాలలో ఒక ట్రాక్టర్‌ను దేవిపట్టణం పోలీస్ స్టేషన్‌కు తీసుకురావడానికి హెడ్ కానిస్టేబుల్ మహేష్ కుమార్ స్వయంగా నడుపుకుంటూ బయలుదేరారు.
బస్సు ఢీకొనడంతో ప్రమాదం
ట్రాక్టర్ రామనాథపురం – తిరుచ్చి జాతీయ రహదారిపై పెరువయల్ మలుపు వద్దకు రాగానే, నాగర్‌కోయిల్ నుండి వేలాన్ కన్ని వైపు అతివేగంగా వెళ్తున్న ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్ బస్సు నియంత్రణ కోల్పోయి ట్రాక్టర్ వెనుక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు, ట్రాక్టర్ రెండూ రోడ్డుపై బోల్తా పడ్డాయి. ప్రమాద శిథిలాల మధ్య చిక్కుకుపోయిన హెడ్ కానిస్టేబుల్ మహేష్ కుమార్‌కు తలపై తీవ్ర గాయాలు కావడంతో ఆయన ఘటనా స్థలంలోనే మరణించారు. బస్సులో ప్రయాణిస్తున్న 10 మందికి పైగా ప్రయాణికులకు కూడా గాయాలయ్యాయి. ఇసుక దొంగతనం ఫిర్యాదుపై వెళ్తున్నప్పుడు ఇప్పుడే వెళ్లవద్దు, ప్రమాదకరమని తన భర్తను వారించానని, అయితే, ఆయన తన విధి నిర్వహణకే ప్రాధాన్యత ఇచ్చి మమ్మల్ని వదిలి వెళ్లిపోయారని మహేష్ కుమార్ భార్య కన్నీరుమున్నీరయ్యారు. హెడ్ కానిస్టేబుల్ మహేష్ కుమార్ మరణంతో ఆయన కుటుంబాన్ని అదుకునేందుకు సీఎం విజయ్ నిర్ణయించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన మహేష్ కుమార్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ,రూ. 30 లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.


