తిరుచ్చి ప్రాణసమానం | - | Sakshi
Sakshi News home page

తిరుచ్చి ప్రాణసమానం

Jun 2 2026 3:06 AM | Updated on Jun 2 2026 5:53 PM

తిరుచ్చి సభలో సీఎం విజయ్‌

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే అధినేత విజయ్‌ పెరంబదూరు, తిరుచ్చి ఈస్ట్‌లలో పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. నిబంధనల ప్రకారం తిరుచ్చి ఈస్ట్‌ ఎమ్మెల్యే పదవికి విజయ్‌ రాజీనామా చేశారు. ఈ నేపథ్యంలో, తిరుచ్చి ఈస్ట్‌ నియోజకవర్గ ప్రజలకు స్వయంగా కృతజ్ఞతలు తెలిపేందుకు సోమవారం మధ్యాహ్నం చైన్నె నుంచి తిరుచ్చికి వెళ్లారు. తిరుచ్చి విమానాశ్రయంలో సీఎం విజయ్‌కు అధికారులు, టీవీకే ముఖ్య నేతలు, మంత్రలు ఆహ్వానం పలికారు. విమానాశ్రయం నుంచి సభ జరిగే జోసెఫ్‌ కాలేజీ మైదానం వరకు 10 కిలోమీటర్ల మేర ప్రజలు, టీవీకే శ్రేణులు బ్రహ్మాండమైన రోడ్‌ షోతో సీఎం విజయ్‌కు స్వాగతం పలికారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య, ఎంపిక చేసిన 5 వేల మందిని ఈ సభకు అనుమతించారు. అయినప్పటికీ ఆ సంఖ్యను దాటిమహిళలు తరలి రావడం విశేషం. సభలో మంత్రులు ఆనంద్‌, రమేష్‌, రాజ్‌ మోహన్‌, మాజీ మంత్రి కు.ప.కృష్ణన్‌ ప్రసంగించారు. చివరగా సీఎం విజయ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆవేశ పూరితంగా తనదైన శైలిలో ప్రసంగించారు.

ఎమ్మెల్యేల కొనుగోలు వంటి అంశాలను నమ్మొద్దు..
ప్రభుత్వాన్ని రక్షించుకునేందుకు ఎమ్మెల్యేలను కొనడానికి తాను ప్రయత్నిస్తున్నానంటూ వస్తున్న ఆరోపణలను సీఎం విజయ్‌ పూర్తిగా కొట్టిపారేశారు. తాను భేరసారాలకు పాల్పడుతున్నానని.. కొందరు పనిగట్టుకుని తప్పుడు కథలు అల్లుతున్నారని మండి పడ్డారు. నిజానికి ఒక తీరని శక్తి (డీఎంకే), తీరిపోయిన శక్తి (అన్నాడీఎంకే) కలిసి, దొడ్డి దారిలో అధికారం కోసం భేరసారాలు సాగించి, కూటమి కట్టి మళ్లీ అధికారాన్ని దోచుకోవాలని కుట్ర పన్నాయని ఆరోపించారు. ఎందుకంటే, త్వరితగతిన టీవీకే పూర్తిస్థాయి మెజారిటీతో స్థిరపడితే పప్పులు ఉడకవని వారి భయం అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలతో 50, 60 ఏళ్లుగా ఉన్న కులం, మతం, డబ్బు పంపిణీ రాజకీయాలకు ప్రజలు చరమగీతం పాడారన్నారు. టీవీకేకు పూర్తి స్థాయిలో మరి కొంత మెజారిటీ ఇచ్చి ఉండే బాగుండేదని ఈసందర్భంగా మైనారిటీ అన్న అంశంపై వ్యాఖ్యలు చేశారు.

స్టాలిన్‌ వర్సెస్‌ విజయ్‌..
తమిళనాడు భవిష్యత్తు ఎటువైపు అనేది తేలిపోయిందంటూ ప్రజల కోసం నిజాయితీగా పనిచేయడానికి వచ్చిన ఈ విజయ్‌ వైపా? లేదా మన ప్రజా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్న స్టాలిన్‌ వైపా? అనేది స్పష్టమైందన్నారు. డీఎంకే తమను ఎంత అవమానిస్తే తమకు అంత మేలు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. కొన్నివారాలలో తన ప్రభుత్వం సాధించిన విజయాలను సీఎం విజయ్‌ ఈసందర్భంగా గుర్తు చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అమలు చేశామన్నారు. 

ఇందులో మొదటి 100 యూనిట్లు ఉచితం అన్న పథకం డీఎంకే ఇచ్చింది కాదని, గతంలో దివంగత సీఎం జయలలిత ఇచ్చిన పథకం అని గుర్తు చేశారు. దానికి అదనంగా మరో 100 యూనిట్లు కలిపి 200 యూనిట్లు తాము చేశామన్నారు. మహిళలకు, కుటుంబాలకు శాపంగా మారిన టాస్మాక్‌ మద్యం దుకాణాలను దశలవారీగా మూసివేస్తున్నామన్నారు. అలాగే రైతుల ప్రయోజనాల కోసం వ్యవసాయ రుణాలను వీలైనంత మేరకు మాఫీ చేశామన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను పూర్తిగా అగాథంలోకి నెట్టి, అన్ని తలుపులు మూసేసి వెళ్లిందిదని, దాన్ని చక్కదిద్దడానికి సమయం పడుతుందన్నారు.

శాంతిభద్రతలపై స్పందన
రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ క్షీణించిందన్న ఆరోపణలపై సీఎం స్పందిస్తూ.. ‘గత స్టాలిన్‌ మోడల్‌ పాలనలో రాష్ట్రంలోని ప్రతి వీధికి, ఊరికి గంజాయి, డ్రగ్స్‌ సంస్కృతిని వ్యాపింపజేశారన్నారు. దాన్ని అప్పుడే అణచివేసి ఉంటే, ఈరోజు మహిళలపై ఇన్ని నేరాలు జరిగేవి కావు అని పేర్కొన్నారు. పాపాలన్నీ వారు చేసి, ఇప్పుడు పగటి వేషాలు వేస్తూ నిందలు తన మీద వేస్తున్నారన్నారు. మహిళల భద్రత కోసం ’సింగపెన్‌’ వంటి బలమైన విభాగాలను బలోపేతం చేశామని, సమర్థులైన పోలీస్‌ అధికారులను నియమించామని స్పష్టం చేశారు.

చివరగా, తాను ఇచ్చిన మాట ప్రకారం అవినీతి, లంచం లేని స్వచ్ఛమైన పాలన అందిస్తానని, ద్రవిడ సిద్ధాంతాలైన సామాజిక న్యాయం, రాష్ట్ర హక్కులు, నదీ జలాల హక్కులు, లౌకికవాద విధానాలను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని సీఎం విజయ్‌ స్పష్టం చేశారు. ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్‌ ఉప ఎన్నికల్లో స్థానిక నియోజకవర్గం కుటుంబం నుంచే ఒకరిని అభ్యర్థిగా నిలబెడతానని, వారిని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన తిరుచ్చి ప్రజలను కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement