షావుకారుపేటలో
నిధి జ్యూవెల్స్ ప్రారంభం
సాక్షి,చైన్నె: సినీ, పారిశ్రామిక రంగాలలో రాణిస్తున్న తెలుగు ప్రముఖులు తంగుటూరి రామకృష్ణ, ఆయన కుమారుడు సాయిచందన్, హైదరాబాదుకు చెందిన వూర బాబురావు, ఆయన కుమారుడు వూర కృష్ణ భాగస్వాములుగా స్థానిక షావుకారుపేట ఎన్‌ఎస్‌సీ బోస్ రోడ్డులోని గిరి కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో ఆధునిక హంగులతో నిధి జ్యూవెల్స్‌ను ఏర్పాటు చేశారు. సోమవారం తంగుటూరి రామకృష్ణ కుటుంబ సభ్యులు తశ్య, తన్విక్‌లు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . ప్రారంభోత్సవంలో చందన్, డాక్టర్ ఎంవీ నారాయణగుప్తా. అర్నెల్లి బద్రినాధ్, కేకే త్రినాద్ కుమార్ సహా నగరంలోని పలు జ్యూవెరీ షాపుల యజమానులు, వామ్ సభ్యులు, పురప్రముఖులు పాల్గొని నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.
ప్రియురాలిపై హత్యాయత్నం
తిరువొత్తియూరు: తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందని ఒక కళాశాల విద్యార్థినిని దారుణంగా కొట్టి, గొంతు నులిమి చంపడానికి ప్రయత్నించిన సంఘటన సంచలనం కలిగించింది. నవీన్ శివగంగ జిల్లాకు చెందిన నవీన్ (22)తిల్లానగర్‌లోని ఒక రియల్ ఎస్టేట్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. ఇతనికి రామనాథపురం జిల్లాకు చెందిన కళాశాల విద్యార్థినితో పరిచయం ఏర్పడి వీరిద్దరూ గత రెండేళ్లుగా ప్రేమలో ఉన్నారు అయితే నవీన్ పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, తన తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ఆ యువతి నిరాకరించింది. ఆదివారం సాయంత్రం తిరుచ్చిలోని అన్న స్టేడియం సమీపంలో వీరిద్దరూ మాట్లాడుకుంటుండగా వీరి మధ్య గొడవ జరిగింది. ఆవేశానికి లోనైన నవీన్, తన వద్ద ఉన్న శాలువాతో ఆమె గొంతు నులిమి, సమీపంలోని రాయిని తీసుకుని ఆమె తలపై బలంగా కొట్టాడు. తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి పడిపోయిన ఆ యువతిని పోలీసులు రక్షించి, చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేకేనగర్ పోలీసులు నవీనన్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసి, అతన్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
రోడ్డు విస్తరణ పనులు
కొరుక్కుపేట: చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ ప్రాంగణంలో ప్రయాణికులు, బస్సుల రద్దీని తగ్గించేందుకు, సబర్బన్ ఎలక్ట్రిక్ రైల్వేస్టేషన్ ముందున్న రోడ్లను విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అదే సమయంలో ఆటోడ్రైవర్లు పూర్తిస్థాయిలో సహకరిస్తేనే ఈ రద్దీ సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని రైల్వే అధికారులు తెలిపారు. చైన్నెకి ప్రధాన ప్రవేశ ద్వారమైన సెంట్రల్ రైల్వే స్టేషన్, మోర్ మార్కెట్ సబర్బన్ రైల్వే స్టేషన్, చైన్నె కార్పొరేషన్ కార్యాలయం, పార్క్ రైల్వే స్టేషన్, రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి అన్నీ సమీపంలోనే ఉన్నాయి, అందువల్ల ఈ జంక్షన్ ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ప్రతిరోజూ 150కి పైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు, 119 సబర్బన్ రైళ్లు నడుస్తాయి. ప్రతిరోజూ 2 లక్షలకు పైగా ప్రయాణికులు ఈ కాంప్లెక్స్ నుంచి రాకపోకలు సాగిస్తారు. ముఖ్యంగా కోయంబత్తూరు, ఈరోడ్, అరక్కోణం తదితర ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్లే చాలా మంది ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణికులు, సబర్బన్ ప్రయాణికులు 6వ గేటును ఉపయోగిస్తారు. పెరియార్ రోడ్డు నుంచి వస్తున్న వందలాది వాహనాలు, ప్రయాణికులను ఎక్కించుకునే, దించే ఆటోలు సబర్బన్ రైల్వే స్టేషన్ ముందు చాలా సేపటి వరకు నిలిచిపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్రమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. దీని కారణంగా చాలా మంది ప్రయాణికులు నిరంతరం రైళ్లను కోల్పోతూ ఉండేవారు. దీనిని నివారించడానికి, 2025లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్(ఆర్‌పీఎఫ్) ఇన్‌స్పెక్టర్ మధుసూదన్‌రెడ్డి వాహనాలు విడివిడిగా వెళ్లేందుకు వీలుగా తాత్కాలిక ఇనుప బారికేడ్‌లను ఏర్పాటు చేశారు. దీనివల్ల రద్దీ కొంతమేర తగ్గినప్పటికీ, రోడ్డు ఇరుకుగా ఉండడంతో ఇది పూర్తిస్థాయి పరిష్కారాన్ని అందించలేకపోయింది. దీని తరువాత చైన్నె భద్రతా దళాలు, రైల్వే డివిజనల్ అధికారులు చైన్నె సెంట్రల్ రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ రోడ్డును విస్తరించేలా చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు.
సాంస్కృతిక నందవన పార్క్ ఏర్పాటు
సాక్షి, చైన్నె : తమిళనాడులో పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా చారిత్రాత్మక పర్యాటక ప్రాంతమైన మామల్లపురం(మహాబలిపురం) సమీపంలోని ఈస్ట్‌కోస్ట్ రోడ్డులో ఉన్న ‘తిరువిడంతై’ వద్ద భారీ కల్చరల్ పార్క్ పనులు ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఉన్న ప్రసిద్ధ నిత్య కళ్యాణ పెరుమాళ్ ఆలయానికి చెందిన 218 ఎకరాల దేవదాయ శాఖ భూమిని పర్యాటక అభివృద్ధి కోసం ఉపయోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంతో మొత్తం రూ.99.67 కోట్ల అంచనా వ్యయంతో తమిళనాడు పర్యాటక అభివృద్ధి సంస్థ 4 విడతలలో ఈ సాంస్కృతిక నందవన పార్క్‌ను నిర్మించనుంది. రూ.22.53 కోట్ల విలువైన మొదటి విడత పనులకు మార్చి 5న శంకుస్థాపన జరిగింది. ఈ పార్కులో తమిళ సంప్రదాయ సంస్కృతిని ప్రతిబింబించే అందమైన శిల్పాలు, కలువ పూల కొలనులు, పచ్చని పచ్చిక బయళ్లు, వాకింగ్ ట్రాక్స్, ఆటోమేటిక్ లైటింగ్ సిస్టమ్ ఆధునిక మరుగుదొడ్ల వసతిని కల్పిస్తున్నారు. ప్రస్తుతం సదరు నిర్మాణ ప్రాంతంలో ఒక తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసి, స్థలాన్ని శుభ్రపరచడం, మ్యాప్ ప్రకారం కొలతలు తీసుకోవడం, భూసార(ఇసుక) పరీక్షలు తదితర ప్రాథమిక పనులను వేగంగా నిర్వహిస్తున్నారు.


