అన్నానగర్: రామనాథపురం జిల్లాలోని పుదుమడం బీచ్ లో కోస్ట్ గార్డ్, కస్టమ్స్ శాఖ సంయుక్తంగా శనివారం తెల్లవారుజామున నిర్వహించిన సోదాల్లో ఓ సరుకు రవాణా వాహనం నుంచి అధికారులు 35,000 వీదేశీ సిగరెట్ల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విదేశీ సిగరెట్ల విలువ కోటి రూపాయలు. ఈ సిగరెట్లను పడవ ద్వారా శ్రీలంకకు అక్రమంగా తరలించనున్నట్లు విచారణలో వెల్లడైంది. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి డ్రైవర్ మురుగన్‌ను అరెస్టు చేశారు. ఈ సిగరెట్ల అక్రమ రవాణా వెనుక ఉన్న ముఠా, దాని కీలక స్థావరాలపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు.
వేలూరు: రాణిపేట జిల్లా ఆర్కాడు సమీపంలోని కరికందాగల్ గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్(23)లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు సమీపంలోని మారియమ్మన్ ఆలయ వీధికి చెందిన నరేష్(25) కూడా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం ఉదయం అరుణ్‌కుమార్ సెయ్యారు నుంచి ఆర్కాడు వైపునకు లారీని నడుపుతున్నాడు. అదే విధంగా నరేష్ ఆర్కాడు నుంచి సెయ్యారుకు లారీ తీసుకెళ్తున్నాడు. ఈ రెండు లారీలు ఆర్కాడు సమీపంలోని కలవై క్రాస్ రోడ్డు వద్ద వస్తున్న సమయంలో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు లారీల ముందు భాగం నుజ్జునుజ్జు కావడంతో రెండు లారీలో ఉన్న డ్రైవర్‌లు ఇనుప కమ్మీల్లో చిక్కుకొని అక్కడిక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందజేయడంతో పోలీసులు ప్రమాద స్థలానికి చేరుకొని జేసీబీ సాయంతో రెండు లారీలను వేరు చేసి మృతదేహాలను బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
సాక్షి, చైన్నె: పర్యాటకులకు మలేషియాను మరింత చేరువ చేసేందుకు ప్రముఖ పర్సనలైజ్డ్ ట్రావెల్ ప్లాట్‌ఫామ్ పిక్‌యువర్‌ట్రైల్, మలేషియా పర్యాటక శాఖ మధ్య అవగాహన ఒప్పందం జరిగింది. చైన్నెలోని మలేషియా కాన్సుల్ జనరల్ కె.శరవణ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. ఈ భాగస్వామ్యంలో భాగంగా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ప్యాకేజీలను ప్రవేశపెట్టారు. ప్రయాణికులు మలేషియా పర్యటనకు వెళ్లి వచ్చాక, ఆ ఖర్చును 3 నుండి 9 నెలల సులభ వాయిదాలలో చెల్లించే విధంగాచర్యలు తీసుకున్నారు. పాత పద్ధతిలో ఉండే ఒకే రకమైన ప్యాకేజీలు కాకుండా, భారతీయుల అభిరుచులకు తగ్గట్టుగా ప్రత్యేకంగా రూపొందించిన పర్యటనలను ఈ ప్లాట్‌ఫామ్‌ను వేదిక చేశారు. ప్రముఖ ఎయిర్‌లైన్స్ భాగస్వామ్యంతో విమాన టిక్కెట్లపై ప్రత్యేక రాయితీలను కూడా ఈ ఒప్పందం ద్వారా అందించనున్నారు. కార్యక్రమంలో పిక్‌యువర్ ట్రైల్ సీఈఓ హరిగణపతి, మలేషియా టూరిజం డైరెక్టర్ హిషాముద్దీన్ ముస్తఫా తదితరులు పాల్గొన్నారు.
తిరుమల: తమిళనాడు రాష్ట్రం చంగల్ పట్టు ప్రాంతానికి చెందిన ఆదర్శ్(12) అలిపిరి మెట్ల మార్గంలో సుమారు 2500వ మెట్టు వద్ద తప్పిపోయాడు. విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏవీఎస్వో లు స్పందించి సిబ్బందిని అప్రమత్తం చేసి విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తిరుమలలోని పీఏసీ –2 ప్రాంతంలో బాలుడు కనిపించినట్లు విజిలెన్స్ సెక్యూరిటీ సిబ్బంది గుర్తించారు. అనంతరం ఆదర్శ్‌ను సురక్షితంగా లేపాక్షి సర్కిల్‌లోని విజిలెన్స్ కార్యాలయానికి తీసుకువచ్చి ఎవీఎస్వో వెంకట శివకుమార్, కృష్ణయ్య సమక్షంలో అతని బంధువులకు అప్పగించారు. ఈ సందర్భంగా టీటీడీ విజి లెన్స్ సిబ్బందికి బాలుడి బంధువులు కృతజ్ఞతలు తెలిపారు. తప్పిపోయిన బాలుడిని త్వరితగతిన గుర్తించి సురక్షితంగా అప్పగించిన విజిలెన్స్ సిబ్బందిని టీటీడీ ఉన్నతాధికారులు అభినందించారు.
తిరుమల: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు 69,049 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 23,842 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.57 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. సర్వదర్శనం భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాల్సి ఉంది.


