సాక్షి, చైన్నె : ముప్పై స్థానాలతో కూడిన కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో 9వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. నామినేషన్ల ప్రక్రియ గత నెల ముగియడంతో అభ్యర్థులు ఓట్ల వేటలో తీవ్రంగా నిమగ్నమయ్యారు. ఈ ఎన్నికలలో అధికార ఎన్‌ఆర్ కాంగ్రెస్ 16 చోట్ల, కూటమిలోని బీజేపీ 10 చోట్ల, అన్నాడీఎంకే 2 చోట్ల, లక్ష్య జననాగయ కట్చి రెండు చోట్ల పోటీ చేస్తున్నాయి. ఇక ప్రతిపక్ష ఇండియా కూటమిలో కాంగ్రెస్ 16 చోట్ల, డీఎంకే 13 చోట్ల, వీసీకే ఒక చోట పోటీలో ఉన్నాయి. ఆది నుంచి కూటమి వివాదం, రెబల్స్ రచ్చ సాగినా, ఎన్నికల సమయానికి కూటమిలోనే నేతలు ఒకే వేదిక మీదకు వచ్చినట్టు గత రెండు మూడు రోజులుగా ఐక్యతను చాటుకునే పనిలో పడ్డారు. ఇండియా కూటమికి మద్దతుగా ఏఐసీసీ నేత రాహుల్, తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రచారం నిర్వహించారు. ఎన్‌డీఏ కూటమి అభ్యర్థులకు మద్దతుగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి తదితరులు ప్రచారంలో దూసుకెళ్లారు. గత వారం రోజులుగా హోరెత్తిన ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. చివరి రోజున ఆయా అభ్యర్థులు ఓపెన్ టాప్ వాహనాలలో దూసుకెళ్లారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు అన్నామలై సైతం ప్రచారంలో దూసుకెళ్లారు. మంగళవారం తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయ నిది స్టాలిన్ సుడిగాలి పర్యటన చేశారు. పుదుచ్చేరిలో స్వతంత్ర పాలన లేదని, ఢిల్లీ నుంచి రిమోట్ ద్వారా సాగే ప్రభుత్వం నడుస్తున్నట్టు ధ్వజమెత్తారు. పుదుచ్చేరిలో ప్రతి విషయంలోనూ లెఫ్టినెంట్ గవర్నర్ జోక్యం చేసుకోవడం వలన ప్రజా ప్రభుత్వానికి విలువ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వద్దే వద్దని , ద్రావిడ ఇంజిన్ అనే సింగిల్ ఇంజిన్‌తో ముందుకెళ్దామని ఓటర్లకు పిలుపు నిచ్చారు.
టాస్మాక్‌ల మూత
ప్రచారం సమాప్తం కావడంతో పుదుచ్చేరి, యానం, మగే, కారైక్కాల్‌పరిసరాలోని అసెంబ్లీ నియోజకర్గాలలో భద్రతను కట్టుదిట్టం చేశారు. గురువారం జరగనన్నది ఎన్నికలకు బుధవారం ఈవీఎంలను , వీవీ ప్యాడ్‌లను తరలించేందుకు సిద్ధమయ్యారు. ఇక, మంగళవారం సాయంత్రం నుంచి శుక్రవారం ఉదయం వరకు పుదుచ్చేరిలోని అన్ని బార్లు, మద్యం దుకాణాలకు సీల్ వేశారు.శాంతిభద్రతలను కట్టుదిట్టం చేస్తూ చర్యలు తీసుకున్నారు. పుదుచ్చేరి సరిహద్దుల్లోని 19 ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి, 24 గంటల పాటు నిఘా ఉంచారు. మద్యం రవాణాను అరికట్టేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించి మద్యం విక్రయించినా లేదా నిల్వ చేసినా, తమిళనాడు నుంచి తరలించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు మద్యం దుకాణాలకు మూత పడటంతో ముందుగానే మద్యం సీసాలను కొనుగోలు చేయడానికి మందుబాబులు ఎగబడటంతో వైన్ షాపుల వద్ద విపరీతమైన రద్దీ పెరిగింది.
పుదుచ్చేరిలో ఉదయనిధి స్టాలిన్ ప్రచారం


