అన్నానగర్: విల్లుపురం జిల్లాలోని తిరుచిట్రపాలంకు చెందిన మోహన్ (28). ప్లస్–2 విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించిన కేసులో 2019లో అరెస్టు అయ్యాడు. ఆరోవిల్ పోలీసులు అతనిపై పొక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. విచారించిన విల్లుపురం పొక్సో ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి వినోదా మంగళవారం మోహన్‌కు 33 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.20వేలు జరిమానా విధించారు.
విజయ్‌కు 51 షరతులు
సాక్షి, చైన్నె :తిరునెల్వేలి, కన్యాకుమారి ప్రాంతాల్లోని 22 మంది అభ్యర్థుల తరపున విజయ్ ప్రచారం చేయనున్నారు. గతంలో కరూర్‌లో జరిగిన తొక్కిసలాట సంఘటనలను దృష్టిలో ఉంచుకుని, ఆయన ప్రచారానికి పోలీసులు తాజాగా 51 కఠిన నిబంధనలను విధించారు. బుధవారం తిరునల్వేలి పాలయంకోట్టై కేడీసీ నగర్ ప్రాంతంలో బహిరంగ సభకు అనుమతి ఇచ్చారు. విజయ్ రోడ్ షో ద్వారా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అంబులెన్స్, అగ్నిమాపక యంత్రాలు , తగినంత పోలీసు బలగాలను పార్టీయే స్వయంగా ఏర్పాటు చేసుకోవాలని షరతు విధించారు. భద్రతా కారణాలు సమయాభావం వలన మంగళవారం నుంచి చైన్నెలో జరగాల్సిన మూడు రోజుల ప్రచారాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు.
రాహుల్, ప్రియాంకప్రచారానికి ఏర్పాట్లు
సాక్షి, చైన్నె: తమిళనాడులో ఏఐసీసీ నేతలు రాహుల్, ప్రియాంక గాంధీ ప్రచారం కోసం కాంగ్రెస్ కసరత్తులు చేపట్టింది. డీఎంకే కూటమికి మద్దతుగా వీరి ప్రచార వేదికలను ఎంపిక చేస్తున్నారు. వివరాలు.. డీఎంకే కూటమిలో కాంగ్రెస్ 28 స్థానాలో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అభ్యర్తులకు మద్దతుగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ , ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తమిళనాడులోని ప్రధాన నగరాల్లో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పాల్గొనేందుకు నిర్ణయించారు. అలాగే పొరుగు రాష్ట్రాల సీఎంలైన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డి.కె. శివకుమార్ , తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా తమిళనాడులో రెండుసార్లు పర్యటించి ప్రచారం చేయడానికి సంబంధించిన కసరత్తుల్లో టీఎన్‌సీసీ వర్గాలు ఉన్నాయి. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగైతో పాటూ మాజీ అధ్యక్షులు, కీలక నేతలు ఈ ప్రచార పర్వంలో భాగస్వాములు కానున్నారు. ముఖ్యంగా యువ ఓటర్లలో రాహుల్, ప్రియాంక పర్యటన ఉత్సాహాన్ని నింపుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
మామిడి’ గుర్తు వివాదం!
సాక్షి, చైన్నె : పీఎంకే వ్యవస్థాపకుడు డాక్టర్ ఎస్. రాందాస్ , ఆయన కుమారుడు అన్బుమణి మధ్య పార్టీ పగ్గాల కోసం సాగుతున్న పోరు ఇప్పుడు ’మామిడి’ గుర్తు కేటాయింపు వరకు వెళ్లింది. పీఎంకే పార్టీకి గుర్తింపు చిహ్నమైన ’మామిడి’ గుర్తును ప్రస్తుత ఎన్నికల్లో ఎవరికీ కేటాయించకుండా నిషేధించాలని/ఫ్రీజ్ చేయాలని) రామదాస్ హైకోర్టును ఆశ్రయించారు. గతంలో ఈ పిటిషన్‌ను విచారించిన చైన్నె సివిల్ కోర్టు రాందాసుకు షాక్ ఇచ్చే విధంగా తిరస్కరించింది. దీంతో రాందాస్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్య బసులతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఈ వివాదంపై నేరుగా నిర్ణయం తీసుకునే బదులు, చైన్నె హైకోర్టులో అప్పీల్ దాఖలు చేసుకోవాలని రాందాస్‌కు అనుమతినిచ్చింది. ఒకవేళ ఈ గుర్తుపై స్పష్టత లేకపోతే, ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని నిబంధనల ప్రకారం నిర్ణయం తీసుకోవాలని సూచించింది.
హైకోర్టులో తక్షణ విచారణ
సుప్రీంకోర్టు సూచన మేరకు రాందాసు మంగళవారం చైన్నె హైకోర్టులో అత్యవసర విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నందున, మామిడి గుర్తును ఉమ్మడి చిహ్నాల జాబితాలో ఉంచాలని లేదా వివాదం తేలే వరకు ఎవరికీ కేటాయించకూడదని రాందాసు తరపు న్యాయవాదులు హైకోర్టులో వాదించారు. చివరకు పిటిషన్ దాఖలు చేస్తే, దానిని విచారణకు స్వీకరిస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి హామీ ఇచ్చారు. దీంతో ఆ దిశగా చర్యలు తీసుకున్నారు. దీంతో తమిళనాడు, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నందున, హైకోర్టు ఇచ్చే తీర్పు పీఎంకే భవిష్యత్‌ను నిర్ణయించనుంది.


