సాక్షి,చైన్నె : తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంగళవారం ఉదయం సీర్గాళి వీధుల్లో వాకింగ్ చేస్తూ, ప్రజలతో మమేకమయ్యే వ/ధంగాముందుకు సాగారు. ప్రజల్ని పలకరిస్తూ, వారితో కలిసి తానూ సామాన్యుడిగా చాటే విధంగా టీ తాగుతూ ఎన్నికల ప్రచారంలో భాగమయ్యారు.
మార్నింగ్ వాక్ – ప్రజా క్షేత్రంలో
పుదుచ్చేరిలో ప్రచారం ముగించుకుని మంగళవారం రాత్రి సీర్గాళికి సీఎం స్టాలిన్ చేరుకున్నారు. ఉదయాన్నే తన దిన చర్యలో భాగంగా సీర్కాళి వీధులలో వాకింగ్‌కు వెళ్లారు. డీఎంకే జిల్లా కార్యదర్శి నివేదా మురుగన్, ఎమ్మెల్యే పన్నీర్ సెల్వం, ఇతర కీలక నేతలతో కలిసి తెన్ పాతి ప్రాంతం నుంచి ఆయన వాకింగ్ మొదలెట్టారు. వాకింగ్‌లో భాగంగా స్థానిక రైతు బజార్‌కు వెళ్లిన స్టాలిన్, అక్కడ కూరగాయలు విక్రయిస్తున్న రైతులతో మాట్లాడారు. వ్యాపారం ఎలా సాగుతోంది? ఏవైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు ఇచ్చిన విజ్ఞప్తులు స్వీకరించారు.
టీ కొట్టులో ముచ్చట్లు
కచ్చేరి రోడ్డు, పాత బస్టాండ్ మీదుగా సాగిన ఈ పర్యటనలో ఆయన అకస్మాత్తుగా ఒక టీ కొట్టులోకి వెళ్లారు. అక్కడ స్వయంగా టీ తాగుతూ, దుకాణదారుడితో వ్యాపార విశేషాలను చర్చించారు. ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలో ప్రజలను కలుసుకున్న క్రమంలో, అక్కడికి వచ్చిన పాఠశాల , కళాశాల విద్యార్థులతో సీఎం ఉత్సాహంగా ముచ్చటించారు. విద్యార్థులు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడగా, స్టాలిన్ వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు.
కూటమి అభ్యర్థి కోసం ఓట్ల వేట
తమ కూటమిలో భాగమైన ఎండీఎంకే అభ్యర్థి ఆర్. సెంథిల్ సెల్వన్ కోసం స్టాలిన్ స్వయంగా ఓట్లు అభ్యర్థించారు. ’ఉదయ సూర్యుడు’ గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. సాయంత్రం సీర్కాళిలో భారీ బహిరంగ సభ జరిగింది. ఇందులో మైలాడుదురై, సీర్కాళి, పూంబుహార్, నాగపట్నం, వేదారణ్యం, కీల్వేలూరు నియోజకవర్గాలకు చెందిన డీఎంకే , మిత్రపక్షాల అభ్యర్థుల తరపున స్టాలిన్ ఓటర్లను ఉద్ధేశించి ప్రసంగించారు. ద్రావిడ మోడల్‌ప్రభుత్వ పథకాలు, పనితీరు, సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రధాన ప్రతి పక్ష నేత పళణి స్వామిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.


