సాక్షి, చైన్నె : ఎన్నికల వేళ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల అర్హతపై దాఖలైన పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు విచారణకు మంగళవారం స్వీకరించింది. ఎస్సీ రిజర్వుడ్ స్థానాల్లో హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారిని మాత్రమే పోటీకి అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై స్పందించాలని, వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోర్టు ఆదేశించింది.
పిటిషన్ నేపథ్యం ఇదీ..
హిందూ మక్కల్ కట్చి వ్యవస్థాపకుడు అర్జున్ సంపత్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్న ప్రధానాంశాలలో తమిళనాడులోని 234 నియోజకవర్గాల్లో 44 స్థానాలు ఎస్సీలకు కేటాయించబడ్డాయని వివరించారు. భారత రాజ్యాంగం ప్రకారం.. హిందూ, సిక్కు లేదా బౌద్ధ మతాలను అనుసరించే వారు మాత్రమే ఎస్సీలుగా పరిగణించబడతారన్నారు. అయితే, ఈ 44 నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో సుమారు 90 శాతం మంది క్రైస్తవ మతాన్ని అనుసరిస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని ఆయన వాదించారు. అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే సమయంలో వారి మతపరమైన అర్హతలను కఠినంగా తనిఖీ చేసేలా ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.
కోర్టు విచారణ – ఆదేశాలు
ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఎ. ధర్మాధికారి, న్యాయమూర్తి జి. అరుళ్ మురుగన్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారించింది. ఎన్నికల కమిషన్ తరపు న్యాయమూర్తి స్పందిస్తూ.. అభ్యర్థులు సమర్పించిన ఎస్సీ సర్టిఫికేట్ అసలైనదా కాదా అనే అంశాన్ని మాత్రమే అధికారులు తనిఖీ చేస్తారని, సర్టిఫికేట్ చెల్లుబాటు కాకపోతేనే నామినేషన్ తిరస్కరించబడుతుందని స్పష్టం చేశారు. వాదనల అనంతరం ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను ఆదేశిస్తూ విచారణను గురువారానికి వాయిదా వేశారు. అయితే, నామినేషన్ల పరిశీలన ప్రక్రియను ఆపడానికి ధర్మాసనం నిరాకరించింది. ప్రస్తుతం జరుగుతున్న పరిశీలన యథావిధిగా కొనసాగవచ్చని స్పష్టం చేసింది.


