ఎస్‌ఐఆర్‌ ఆపాల్సిందే..! | - | Sakshi
Sakshi News home page

ఎస్‌ఐఆర్‌ ఆపాల్సిందే..!

Nov 3 2025 6:42 AM | Updated on Nov 3 2025 6:42 AM

ఎస్‌ఐఆర్‌ ఆపాల్సిందే..!

ఎస్‌ఐఆర్‌ ఆపాల్సిందే..!

కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీరు మార్చుకోకుంటే న్యాయ పోరాటం అన్నీ పార్టీల తరపున సుప్రీంకోర్టులో కేసులకు నిర్ణయం రాజకీయ చట్టంలో ప్రత్యేక సవరణకు చోటు లేదని స్పష్టం

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా, చట్ట విరుద్ధంగా చేపడుతున్న ఎస్‌ఐఆర్‌ను ఆపాల్సిందేనని డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌ నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశం డిమాండ్‌ చేసింది. లేకుంటే అన్నీ పార్టీల తరపున చట్ట పోరాటం దిశగా సుప్రీం కోర్టులో పిటిషన్ల దాఖలకు తీర్మానించారు.

సాక్షి, చైన్నె: 2026లో తమిళనాట జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్‌) కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈనెల 4వ తేదీ నుంచి నెల రోజుల పాటూ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటా పరిశీలనలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులకు, శిక్షణ, ఇంటింటా పరిశీలనలు, సర్వేకు బూత్‌ స్థాయిలో సిబ్బంది సన్నద్ధం అవుతున్నారు. తమిళనాట పాగా వేయడం కోసం బీజేపీ కొత్తకుట్రలకు సిద్ధమైందని పేర్కొంటూ, కేంద్ర ఎన్నికల కమిషన్‌ చర్యలను ఆది నుంచి డీఎంకే కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చిన నేపథ్యంలో ఆదివారం చైన్నెలో అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు.

46 పార్టీల మద్దతు..

సీఎం, డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణకు వ్యతిరేకంగా జరిగిన సమావేశానికి 46 పార్టీలు మద్దతు ప్రకటించాయి. డీఎంకే, కాంగ్రెస్‌, ద్రావిడ కళగం, ఎండీఎంకే, వీసీకే, సీపీఎం, సీపీఐ, పీపుల్స్‌ జస్టిస్‌, ఇండియన్‌ యూనియన్‌ ముస్లీంలీగ్‌, మక్కల్‌ నీది మయ్యం, కొంగునాడు మక్కల్‌ దేశీయ కట్చి, తమిళర్‌ వాల్వురిమై కట్చి, మూవేందర్‌ మున్నేట్ర కజగం, ఆమ్‌ఆద్మీ పార్టీ తమిళనాడు రైతులు – కార్మికుల పార్టీ, మనిద నేయమక్కల్‌ కట్చి, మనిద నేయ జననాగక కట్చి, కొంగు యువజన మండలి, ఇండియన్‌ నేషనల్‌ లీగ్‌, తమిళనాడు నేషనల్‌ లీగ్‌, పెరుంతలైవర్‌ మక్కల్‌ కట్చి, బహుజన్‌ సమాజ్‌, డెమోక్రటిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా, న్యూ జస్టిస్‌ పార్టీ, ఇండియన్‌ పీపుల్స్‌ ఎడ్యుకేషనల్‌ డెవలప్‌మెంట్‌ , ఆల్‌ ఇండియా మూవేంధర్‌ ఫ్రంట్‌ , ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, ఆది తమిళ్‌ తదితర పార్టీల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

ఎవర్వెవ్వరు ఏమన్నరంటే..

ఈ సమావేశంలో సీఎం స్టాలిన్‌ మాట్లాడుతూ, ఓటరు జాబితా సవరణను యావత్‌ తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. ఎన్నికల నేపథ్యంలో నిజమైన ఓటర్లను తొలగించేందకు అతి పెద్ద కుట్రకు సిద్ధమయ్యారని ధ్వజమెత్తారు. వీసీకే నేత తిరుమావళవన్‌ మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌ను అడ్డం పెట్టుకుని ఎన్‌ఆర్‌సీ అమలుకు పథకం రచించి ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిని ఎదుర్కొనేందుకు ఆదిలోనే కీలక నిర్ణయం తీసుకోవాలని కోరారు. ద్రవిడ కళగంనేత వీరమణి మాట్లాడుతూ, ఎస్‌ఐఆర్‌కు రాజకీయ చట్టంలో చోటు గానీ, ఎలాంటి అనుమతి లేదని స్పష్టం చేశారు. ఇందుకు ఎన్నికల కమిషన్‌కు అవకాశం, వీలు లేదని, తమిళనాడు వ్యాప్తంగా ఒకే సారి చేపట్టడం వెనుక అతి పెద్ద కుట్ర ఉందనేది స్పష్టమవుతోందన్నారు. బూత్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ను ఎందుకు నియమించారని, ఇందుకు చట్టంతో సంబంధం గానీ, అనుమతి గానీ లేదని వివరించారు. ఎండీఎంకే నేత వైగో మాట్లాడుతూ, బిహార్‌లో రచించిన కొత్త కుట్రలను తమిళనాటు అమలు చేయడానికి కేంద్రం వ్యూహ రచన చేసినట్టుందన్నారు. బిహార్‌లో తొలగించిన ఓటర్లను ఇక్కడ చేర్చేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. తమిళనాడులో 2011 జనాభా లెక్కల మేరకు సుమారు 35 లక్షల మంది ఉత్తరాది కార్మికులు ఉన్నారని, ఈ 14 సంవత్సరాల కాలంలో ఈ సంఖ్య రెట్టింపు అయ్యేందుకు అవకాశాలు ఎక్కువేని వివరించారు. కోయంబత్తూరు,తిరుప్పూర్‌, చైన్నె, కరూర్‌, ఈరోడ్‌ తదితర ప్రాంతాలలో ఉత్తరాది వాసుల పేర్లును తమిళనాడు ఓటర్ల జాబితాలో చేర్చేందుకే ఈ ఎస్‌ఐఆర్‌ చేపడుతుున్నారనే అనుమానం వ్యక్తం చేశారు. తమిళనాడును గురి పెట్టి బీజేపీ రచిస్తున్న కుట్రలను చోద్యం చూడకుండా సమష్టిగా అడ్డుకుందామని పిలుపు నిచ్చారు. టీఎన్‌సీసీ అధ్యక్షుడు సెల్వ పెరుంతొగై మాట్లాడుతూ, తమ నేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే సమగ్రంగా ఓటు చోరీ గురించి వివరించి ఉన్నారని గుర్తు చేస్తూ, తమిళనాడులో ఎస్‌ఐఆర్‌ను అడ్డుకుని తీరుదామని పిలుపు నిచ్చారు. సీపీఎం నేత షణ్ముగం మాట్లాడుతూ, తమిళనాడు హక్కులకు వ్యతిరేకంగా బీజేపీ కుట్రలను ఖండిస్తూ ఆది నుంచి కూటమి పోరాటాలు సాగిస్తూ వస్తున్న విషయాన్ని గుర్తు చేస్తూ, ఎస్‌ఐఆర్‌ వ్యవహారంలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ భారీ నిరసనకు సన్నద్దం కావాలని సూచించారు. సీపీఐ నేత వీర పాండియన్‌ స్పందిస్తూ, కుట్రలతో దొడ్డి దారిలో ఎవ్వరు వచ్చినా, వాటిని సమష్టిగా భగ్నం చేద్దామన్నారు. మక్కల్‌ నీది మయ్యంనేత కమలహాసన్‌ మాట్లాడుతూ, ఓటరు జాబితా పరిశీలన అవశ్యమే అయినా, ఎన్నికలకు ముందుగా ఈ కార్యాచరణకు సిద్ధం కావడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. నిజమైన అర్హుల పేర్లను తొలగిస్తూ చూస్తూ ఊరుకోమని పేర్కొంటూ ఇటీవల కాలంగాకేంద్ర ఎన్నికల కమిషన్‌ పనితీరు ఆ సంస్థపై నమ్మకాన్ని పూర్తిగా సన్నగిళ్లే విధంగాచేస్తున్నట్టు ధ్వజమెత్తారు.

తీర్మానాలు..

తమిళనాడులో ఎన్నికలకు కొన్ని నెలలు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్‌ తీసుకున్న ఎస్‌ఐఆర్‌ నిర్ణయం ఆమోదయోగ్యం కాదని ఈ సమావేశంలో తీర్మానించారు. కేంద్ర ప్రభుత్వంచేతిలో కీలు బొమ్మగా మారి నిరంకుశ ధోరణిని అనుసరిస్తున్న ఎన్నికల కమిషన్‌ తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని ప్రకటించారు.మైనారిటీలు తదితర అర్హులైన ఓటర్ల పేర్లను తొలగించడం లక్ష్యంగా, అనర్హులను చేర్చే ప్రయత్నాన్ని వీడాలని హెచ్చరించారు. బిహార్‌ కుట్రలను ఇక్కడ పారనివ్వమని స్పష్టం చేశారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రజా ప్రాతినిత్య చట్టానికి విరుద్ధంగా సాగుతున్న ప్రయత్నాలను వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్నికలక మిషన్‌ జారీ చేసిన నోటిఫికేషన్‌లో అనేక అంశాలు అస్పష్టంగా ప్రస్తావించ బడినట్టు వివరిస్తూ, ఓటరు ధ్రువీకరణ విషయంలో నిజాయితీ, పారదర్శకత లేదన్న విషయం స్పష్టం అవుతోందని అనుమానం వ్యక్తం చేశారు. ఓటర్ల నుంచి ఆధార్‌ తదితర పత్రాల స్వీకరణ గురించి స్పష్టత ఇవ్వక పోగా గుర్తింపు పత్రాలు, ఇతర ఫాంల గురించి తీవ్ర గందరగోళం సృష్టించి ఉన్నారని ఆరోపిస్తూ తీర్మానం చేశారు.

అఖిల పక్షం డిమాండ్‌

ఈశాన్య రుతుపవనాల సీజన్‌లోనా..?

తమిళనాడులో సాధారణంగా నవంబర్‌, డిసెంబర్‌ నెలలో ఈశాన్య రుతు పవనాల సీజన్‌ బల పడుతున్నాయని, ఈ కాలంలో ఎస్‌ఐఆర్‌ షెడ్యూల్‌ చేయడం మరింత అనుమానాలు కలిగిస్తున్నాయని వివరించారు. వర్షాలసీజన్‌, క్రిస్మిస్‌ తదితర పండుల కాలంలో ఈ సవరణ అన్నది సజావుగా సాగేనా అని కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ప్రశ్నిస్తూ తీర్మానం చేశారు. ఎన్నికల కమిషన్‌ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా కాకుండా తటస్థంగా, స్వతంత్రంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని హితవు పలుకుతూ , తాజాగా కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారి తీసుకున్న ఎస్‌ఐఆర్‌ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్‌చేశారు. ఓటరు జాబితా వ్యవహారం సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న నేపథ్యంలో ఎలా ఎస్‌ఐఆర్‌కు చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తూ, తమిళనాడు ప్రజల ఓటుహక్కుకు విరుద్ధమైన చర్యలను తక్షణం నిలుపుదల చేయాలని కోరారు. ఎస్‌ఐఆర్‌ ఆమోద యోగ్యం కాదని, ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌లో అనేక లోపాలు ఉన్నాయని వివరిస్తూ ఎస్‌ఐఆర్‌ను ఆపాల్సిందేనని పట్టుబడుతూ తీర్మానం చేశారు. 2026 అసెంబ్లీ ఎన్నికల తర్వాత తమిళనాడులో ఓటర్ల జాబితా సవరణపై దృష్టి పెట్టుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ఓటర్ల హక్కును కాపాడేందుకు సుప్రీం కోర్టును ఆశ్రయించడం తప్పా, మరేదారీ తమకు కనిపించడం లేదని స్పష్టం చేశారు. ఎస్‌ఐఆర్‌ను ఆపకుంటే సుప్రీం కోర్టులో అన్ని పార్టీలు పిటిషన్లు దాఖలు చేయడానికి సిద్ధం అని హెచ్చరిస్తూ తీర్మానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement