సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి
సాక్షి, చైన్నె : సామాజిక మాధ్యమాల వేదికగా జనరంజకంగా ప్రచారం ముందుకు తీసుకెళ్లాలని ఐటీ వింగ్‌ను అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిపళణి స్వామి ఆదేశించారు జిల్లాల వారీగా చైన్నెలో ఐటీ విభాగం నేతలతో ఆదివారం సమావేశమయ్యారు. ప్రజల్ని ఆకర్షించే రీతిలో గత కొన్ని నెలలుగా ప్రజా చైతన్యయాత్రను తమిళానుడు, తమిళ ప్రజలను రక్షిద్దామన్న నినాదంతో పళని స్వామి నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. పలు విడతలుగా సాగుతూ వస్తున్న ఈ ప్రచారంలో భాగంగా తాజాగా పార్టీ అనుబంధ విభాగాల ద్వారా సైతం కార్యక్రమాలను విస్తృతం చేయించే దిశగా పళని కసరత్తులలో పడ్డారు. ఇందులో ఐటీ వింగ్ పాత్ర కీలకంగా పరిగణించారు. సామాజిక మాధ్యమాలలో ఐటీ వింగ్ ద్వారా విస్తృతంగా ప్రజల్ని ఆకర్షింప చేయడానికి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు.
ప్రజలలోకి చొచ్చుకెళ్లే ప్రచారం..
రాయపేటలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం 39 జిల్లాలకు చెందిన ఐటీ విభాగం నేతలతో పళణి స్వామి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు దిండుల్ శ్రీనివాసన్, ఎస్పీ వేలుమణి, నత్తంవిశ్వనాథన్, కేపీ మునుస్వామి పళణి స్వామితో పాటూ పాల్గొన్నారు. జిల్లాల వారీగా ఐటీ విభాగం పని తీరు గురించి సమీక్షించారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో సామాజిక మాధ్యమాలపై ఐటీ విభాగం ప్రత్యేక దృష్టి పెట్టాలని పళణిస్వామి సూచించారు. బూత్ కమిటీలు, లీగల్ టీం, విద్యార్ధి, యువజన విభాగాలతో కలిసి సామాజిక మాధ్యమాలను మరింతగా ఉపయోగించుకోవాలని వివరించారు. డీఎంకే ప్రభుత్వ వైఫల్యలాలను, అమలుకు నోచుకోని పథకాలను ప్రధాన అంశాలుగా చేసుకుని సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని సూచించారు. ఉరుట్టు, తిరుట్టు, హల్వా పేర్లతో ఈ ప్రచారాలు ముమ్మరం కావాలని సూచించారు. అలాగే అన్నాడీఎంకే హయాంలో జరిగిన సంక్షేమ పథకాల తీరు తెన్నులను ప్రజలకు సవివరంగా తెలియజేసే రీతిలో, గతంలో అన్నాడీఎంకే వేసిన పునాదులు, నిర్మాణాలు, తాజాగా పూర్తయిన వాటికి డీఎంకే వాడుకుంటున్న పేర్లకు వ్యతిరేకంగా ముందుకెళ్లడమే కాకుండా, ఆ నిర్మాణాలన్నీ అన్నాడీఎంకే ఘనతే అని చాటే విధంగా వినూత్న రీతిలో జన రంజకంగా ప్రచారాలపై ఐటీ వింగ్ పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని ఆదేశించారు. సాంకేతిక పరంగా ఉన్న అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని, ప్రజల గుండెల్లోకి చొచ్చుకెళ్లే విధంగా సందేశాలు, వీడియోలు తదితర వినూత్న అంశాలతో దూకుడు పెంచాలని ఐటీ వింగ్ నేతలకు పళణి స్వామి ఆదేశించారు. సాయంత్రం జరిగిన సమావేశంలో పార్టీ పరంగా జిల్లాల ఇన్‌చార్జ్‌లతో పళణి స్వామి సమావేశమయ్యారు. జిల్లాలో ఇప్పటి వరకు తాను నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రకు వచ్చిన స్పందన, తదితర అంశాల గురించి సమాచారం రాబట్టారు.
హాజరైన ఐటీ విభాగం జిల్లాల నేతలు
సమావేశంలో పళణి స్వామి తదితర నేతలు
సోషల్ మీడియాపై ఫోకస్ పెంచాలి


