సెంగొట్టయ్యన్‌పై ముప్పెట దాడి
సాక్షి, చైన్నె: అన్నాడీఎంకే బహిష్కృత నేత, ఎమ్మెల్యే సెంగొట్టయ్యన్‌పై దక్షిణ తమిళనాడులోని పార్టీ నేతలు ముప్పెట దాడి చేసే పనిలో పడ్డారు. ఇక, ఆయన రాజకీయ జీవితం ప్రశ్నార్థకమే అని అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్‌బీ ఉదయకుమార్ వ్యాఖ్యలు చేశారు. ఆయన్ను పార్టీ నుంచి తొలగించడం ఆనందమే అని మాజీ మంత్రి సెల్లూరు రాజు వ్యాఖ్యలు చేశారు. వివరాలు.. ఐక్య నినాదం పుణ్యమా అన్నాడీఎంకే నుంచి సెంగొట్టయ్యన్‌ను సాగనంపుతూ పార్టీ ప్రధానకార్యదర్శిపళణి స్వామి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఉద్వాసన విషయంగా సెంగొట్టయ్యన్, పళణి మధ్య వ్యాఖ్యల తూటాలు సైతం పేలాయి. ఈ పరిస్థితులలో ఆదివారం మీడియాతో మాట్లాడిన సెంగొట్టయన్ న్యాయవాదుల ద్వారా వివరణ కోరుతూ నోటీసులు పంపించనున్నట్టు ప్రకటించారు. 53 సంవత్సరాలు అన్నాడీఎంకేకు తాను సేవలు అందించానని, ఆ పార్టీ ప్రస్తుతం ఉన్నది తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమేనని వివరించారు.
తనకు పార్టీలో దక్కిన ఈ గుర్తింపు కారణంగా కంట కన్నీళ్లు వస్తున్నాయని, నిద్ర కరువైందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇందుకు సమాధానం ఇచ్చే విధంగా అన్నాడీఎంకే శాసన సభా పక్ష ఉప నేత ఆర్‌బీ ఉదయకుమార్ ఎదురు దాడిచేశారు. తనను తొలగిస్తే ఆనందమే అని వ్యాఖ్యలుచేసిన సెంగొట్టయ్యన్ ఇప్పుడేమో కన్నీళ్లు అంటూ సానుభూతి ప్రయత్నాలలో ఉన్నట్టుందని ఎద్దేవా చేశారు. గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా పార్టీ బహిష్కృతులను నమ్ముకుని తన రాజకీయ జీవితాన్ని సెంగొట్టయ్యన్ ప్రశ్నార్థకం చేసుకున్నారని హితవు పలికారు.
తన చేజేతులా ఆయన రాజకీయ జీవితాని అస్తమయం చేసుకుని, ఇప్పుడు ఒప్పారి పెట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాజకీయ స్వలాభం కోసం సెంగొట్టయ్యన్ ఇక ఎన్ని ఎత్తులు వేసినా అన్నాడీఎంకే కేడర్ నమ్మ బోరని, ఆయన రాజకీయ జీవితానికి ఇక శుభం కార్డు పడ్డట్టే అని స్పష్టంచేశారు. మాజీ మంత్రి సెల్లూరు రాజు స్పందిస్తూ, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పళణి స్వామి పేరును ప్రకటించిందని సెంగొట్టయ్యన్ అని, అయితే, ఇప్పుడేమో తాత్కాలిక ప్రధాన కార్యదర్శి అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సెంగొట్టయ్యన్‌ను పార్టీ నుంచి తొలగించడం ఆనందంగా ఉందన్నారు.


