సీఈసీకి విజయ్ ఏడు ప్రశ్నలు
సాక్షి, చైన్నె: ఎస్‌ఐఆర్ వ్యవహారంలో కేంద్ర ఎన్నికల కమిషన్(సీఈసీ)కి తమిళగ వెట్రి కళగం అధ్యక్షుడు విజయ్ ఏడు ప్రశ్నలను సంధించారు. ఈ వ్యవహారంలో ప్రజలపక్షాన నిలబడేందుకు నిర్ణయించామన్నారు .ప్రజల్ని మమేకం చేస్తూ ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా అవగాహన సదస్సులు, శిబిరాలకు చర్యలు తీసుకున్నారు. కేంద్ర ఎన్నికల కమిషన్ ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా డీఎంకే నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి విజయ్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. అయితే ఆపార్టీ తరపున ఎవ్వరూ ఈ సమావేశానికి హాజరు కాలేదు. అదే సమయంలో విజయ్ ఆదేశాల తో టీవీకే వర్గాలు ఈవ్యవహారంలో కొత్త బాటను ఎంచుకున్నారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలతో కలిసి ముందుకు సాగేందుకు నిర్ణయించారు. ఇందులో భా గంగా కేంద్ర ఎన్నికల కమిషన్‌కు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ, పలు సూచనలు ఇస్తూ విజయ్ ఏడు ప్రశ్నలను సందించారు.ఓటరు జాబితాలో తప్పులు సరిదిద్దేందుక ఫారం, మరణించిన వారిపేర్ల తొగింపునకు ఫారం, ఆధార్‌ను గుర్తింపు కార్డుగా పరిగణిస్తారా లేదా? తదితర ప్రశ్నలను విజయ్ సంధించారు. ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా ప్రజలలో చైతన్యం తీసుకొచ్చే విధంగా అవగాహన సదస్సులు,శిబిరాల నిర్వహణకు నిర్ణయించినట్టు ప్రకటించారు. అదే సమయంలో ఎస్‌ఐఆర్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం అన్నది ప్రవేశ పెట్టి ఆమోదించకుండా, డీఎంకే అఖిల పక్షం అంటూ కొత్త నాటకం రచించడంతోనే తాము ఆ సమావేశానికి దూరంగా ఉన్నట్టు టీవీకే ప్రకటించడం గమనార్హం. ఇదిలా ఉండగా విజయ్ ప్రచార భద్రతకు పీపుల్స్ డిఫెన్స్ ఫోర్స్‌ను నియమించేందుకు సిద్ధమయ్యారు. ఇది వరకు రిటైర్డ్‌పోలీసు అధికారుల నేతృత్వంలో ప్రత్యేక భద్రతా బృందం ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. తాజాగా డిఫెన్స్ ఫోర్సును 2,500 మందితో ఎంపిక చేయనున్నారు. ఇందులో 1,200 మంది మహిళలు ఉన్నారు. వీరికి భద్రతా పరంగా అంశాలతో శిక్షణ ఇస్తున్నారు.


