
రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలు ప్రారంభం
తిరువళ్లూరు: విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు చాలా అవసరమని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో మెదడు చురుకుగా పని చేస్తుందని ఆర్‌ఎంకే విద్యాసంస్థల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సీబీఎస్‌ఈ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు బాస్కెట్‌బాల్ పోటీలను తిరువళ్లూరు జిల్లా కవరపేటలోని ఆర్‌ఎంకే సీబీఎస్‌ఈ పాఠశాల ఆవరణలో ప్రారంభించారు. మూడు రోజులపాటు జరిగే పోటీలను విద్యాసంస్థల చైర్మన్ ఆర్‌ఎస్ మునిరత్నం ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు రెండు వందల పాఠశాలలకు చెందిన ఐదువేల మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొంటున్నారు. ఇందులో అండర్– 14, 17, 19 తదితర మూడు కేటగిరీలుగా విభజించి నాలుగు వందల పోటీలను నిర్వహించనున్నట్టు విద్యాసంస్థల చైర్మన్ మునిరత్నం వివరించారు. ఈ సందర్బంగా ఆర్‌ఎస్ మునిరత్నం మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు ఆసక్తి ఉన్న రంగాలను గుర్తించి వారిని ప్రోత్సహించాల్సిన బాధ్యత పాఠశాల, ఉపాధ్యాయులపై ఉందన్నారు. ప్రతి విద్యార్థిఽలోనూ ఏదో ఒక ప్రావీణ్యం ఉంటుందన్నారు. వాటిని సరైన సమయంలో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. పోటీల్లో విజేతలకు చివరి రోజు కప్, సర్టిఫికెట్, ఓవరాల్ చాంపియన్ కప్‌లను అందించనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల ఉపాధ్యక్షుడు కిషోర్, డైరెక్టర్ జ్యోతినాయుడు, కార్యదర్శి యలమంచి ప్రదీప్, ప్రిన్సిపల్ చంద్రిక ప్రసాద్ పాల్గొన్నారు.
విద్యతోపాటు క్రీడలు అవసరమన్న
ఆర్‌ఎంకే చైర్మన్ మునిరత్నం