
తమిళనాడు రక్షణ కోసం పోరాటం
వేలూరు: భారతదేశ స్వాతంత్య్రానికి మొట్టమొదటి సారిగా వేలూరు కోట నుంచే విప్లవం ప్రారంభించారని, అదే తరహాలో తమిళనాడును రక్షించుకోవడానికి వేలూరు మట్టి నుంచే మహిళలు పోరాటాన్ని ప్రారంభించాలని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి అన్నారు. ఆయన పాదయాత్రను వేలూరు కోట మైదానం సమీపంలో ప్రారంభించారు. అనంతరం అన్నాకలైఅరంగం సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిన్నారుల నుంచి పెద్దల వరకు అత్యాచారాలు పెరిగి పోవడంతో పాటు శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో రోజు పలు నేరాలు జరిగి పోతున్నా వాటిని ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రానున్న ఎన్నికల్లో మహిళలు ఎవరూ డీఎంకే పార్టీకి ఓటు అనే ఆయుధంతో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అమెరికాలో ఉన్న మత్తు పదార్థాలు కూడా తమిళనాడులోని ప్రతి వీధిలోను విక్రయం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం నూతనంగా నలం కాక్కుం స్టాలిన్ పథకం ఒక బూటకమన్నారు. ఈ పథకాన్ని ఎందుకు గత నాలుగు సంవత్సరాలుగా ప్రవేశ పెట్టలేదన్నారు. ప్రభుత్వం కూలే సమ యంలో ఈ పథకాన్ని ప్రారంభించాల్సిన అవసరం ఏమి అని ప్రశ్నించారు. ఈ శిబిరాలు జరగడం ద్వా రా వైద్యులు ఈ శిబిరానికి వస్తే ఆసుపత్రిలో రోగులకు చికిత్స ఎవరు అందజేస్తారని ప్రశ్నించారు. వేలూరు జిల్లాలో పాలారు నది ఉండేదని, ప్రస్తుతం డ్రైనేజీ నీరు వెళుతోందన్నారు. పాలారులో చెక్‌డ్యా మ్‌లు లేకపోవడంతో నీరు పూర్తిగా సముద్రంలో కలిసి పోతుందన్నారు. అనంతరం వేలూరు ఓటేరిలోని చెరువులో చెట్లు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఇళవయగన్, యువజన విభాగం జిల్లా కార్యదర్శి జగన్, కార్పొరేటర్ బాబీ పాల్గొన్నారు.