
సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తా
తమిళసినిమా: సాధారణంగా పెళ్లయితే సినీ కథానాయికలకు అవకాశాలు తగ్గుముఖం పడతాయి. ఇంకా చెప్పాలంటే కొందరైతే పూర్తిగా తెరమరుగవుతారు. నటి నయనతార, బాలీవుడ్‌లో అలియా భట్ తదితరులు మాత్రమే వివాహానంతరం అగ్ర కథానాయికలుగా రాణిస్తున్నారు. మలయాళ బ్యూటీ, సంచలన నటి పార్వతి నాయర్ కూడా వివాహానంతరం హీరోయిన్లను మర్చిపోతారనే మాటను తాను బ్రేక్ చేస్తానని అంటున్నారు. ఏ తరహా పాత్రనైనా నటించడానికి సిద్ధమనే ఈ అమ్మడు అందాలను తెరపై ఆరబోయడానికి సై అంటారు. మలయాళం తమిళం కన్నడం తదితర భాషల్లో నటించిన ఈమె తమిళంలో ఉత్తమ విలన్, ఎంకిట్ట మోదాదే, నిమిర్, ఎన్నై అరిందాల్ తదితర చిత్రాలలో వివిధ రకాల పాత్రలు పోషించి గుర్తింపు పొందారు. పార్వతి నాయర్ తమిళంలో చివరిగా విజయ్ హీరోగా నటించిన గోట్ చిత్రంలో చిన్న పాత్రలో మెరిశారు. కన్నడంలో చివరిగా నటించిన చిత్రం మిస్టర్ రాణి. ఇటీవల ఆశ్రిత్ అశోక్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు. దీంతో ఈ అమ్మడి సినీ కెరీర్ ముగిసిపోయిందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో జోరుగా సాగుతోంది. దీనిపై స్పందించిన పార్వతి నాయర్ తన గురించి సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారం తన చెవికి చేరిందన్నారు. అయితే తాను తెరమరుగు కాలేదని, నటిగా కొనసాగుతానుని ఈ సందర్భంగా అందరికీ చెప్పాలనుకుంటున్నానన్నారు. వివాహానంతరం నటీమణులను మర్చిపోతారనే మాటను తాను బ్రేక్ చేస్తానంటున్నారు. తన భర్త ఆశ్రిత్ అశోక్ తనను నటించవద్దని చెప్పరని తనకు తెలుసు అన్నారు. నిజం చెప్పాలంటే తాను ఆయన్ని పెళ్లి చేసుకోవడానికి ప్రధాన కారణం కూడా ఇదేనని నటి పార్వతి నాయర్ పేర్కొన్నారు.
నటి పార్వతి నాయర్