
రక్తదాన శిబిరానికి అనుహ్య స్పందన
కొరుక్కుపేట: ప్రముఖ టాలీవుడ్ హీరో, సూపర్ స్టార్ మహేష్ బాబు త్వరలో 50వ పుట్టినరోజు జరుపుకోనున్న సందర్భంగా చైన్నె మహేష్ బాబు అభిమానులు రక్తదాన శిబిరాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. చైన్నె సెయింట్ థామస్ మౌంట్,నజరత్‌పురం, గాంధీ గ్రౌండ్ లో చేపట్టిన ఈ రక్తదాన శిబిరానికి అనూహ్య స్పందన లభించింది. నగరం నలుమూలల నుంచి అభిమానులతో పాటూ యువత తరలివచ్చి రక్తదానం చేశారు. ప్రత్యేకించి ఈ రక్తదాన శిబిరంలో సూపర్ స్టార్ కృష్ణ, ప్రిన్స్ మహేష్ బాబు అభిమానులు ఎక్కువమంది పాల్గొని రక్తదానం చేసి అభిమానాన్ని చాటుకున్నారు. చైన్నె మహేష్ బాబు అభిమానులు, రాఘవ –జమునా చారిటబుల్ అండ్ ట్రస్ట్ ఓఅర్ జి బ్లడ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం వరకు సాగింది. ఈ శిబిరంలో పాల్గొన్న రక్త దాతలకు పండ్లు, బిస్కెట్లు, సర్టిఫికెట్ లను అందజేశారు. ఈ సందర్భంగా చైన్నె మహేష్ బాబు అభిమానులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మహేష్ బాబు పుట్టినరోజు అంటే మాకు పండగతో సమానం అన్నారు. ఎంతోమంది పేదవారికి సహాయం చేయటమే కాకుండా ఉచిత గుండె ఆపరేషన్లు, ఎన్నో రకాలుగా తన దాతృత్వాన్ని చాటుకోవడం నిత్యం చేస్తూనే ఉంటారని అటువంటి హీరో మహేష్ బాబుకి అభిమానులుగా ఉండడం మాకు గర్వంగా ఉందన్నారు. ఇక పై సూపర్ స్టార్ మహేష్ బాబు పేరుతో చైన్నెలో పాటు తమిళనాడు వ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. 4,500 మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించడం నిజంగా అభినందనీయమన్నారు. రక్తదానం చేసి, ప్రాణాదాతలు కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కార్యక్రమంలో చైన్నె మహేష్ బాబు ఫ్యాన్స్ తిరుమలశెట్టి శివసాయి, ఉదయ్ కిరణ్, ఎం. వసంత్, ఎ.కిరణ్ కుమార్, టి.ధనహరి, చైతన్య, హర్ష, అనంత్, శ్రీను,సాకేత్ రామ్, వర్మ, శ్రీహర్ష, లింగబాబు, కేఎస్‌వీఎస్ రాఘవ పాల్గొన్నారు.