కథానాయకుడైన నిర్మాత
తమిళసినిమా: తాజాగా మరో నిర్మాత కథానాయకుడిగా అవతారమెత్తారు. ఇంతకు ముందు అరమ్, క/పే.రణసింగం, డాక్టర్, అయలాన్ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన కేజేఆర్ ఇప్పుడు కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. ఈయన హీరోగా నటిస్తున్న చిత్రానికి అంగీకారం అనే టైటిల్‌ను నిర్ణయించారు. స్వస్తిక్ విజన్ పతాకంపై ప్రసాద్, అజిత్ భాస్కర్, అరుణ్‌మురుగన్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా పా.రంజిత్ శిష్యుడు జేపీ.తెన్‌పాదియాన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. చిత్ర వివరాలను మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో దర్శకుడు తెలుపుతూ ఇది పలు యథార్థ సంఘటనలతో కూడిన అథ్లెటిక్ క్రీడా నేపథ్యంలో సాగే కథా చిత్రంగా ఉంటుందన్నారు. క్రీడాకారుల కష్టాలు, ఆ శాఖలో జరిగే అవకతవకలను తెరపై ఆవిష్కరించే చిత్రంగా అంగీకారం ఉంటుందని చెప్పారు. ఇందులో సింధూరి విశ్వనాఽథ్, వీజీ వెంకటేశ్, ఆంథోని, మన్సూర్ అలీఖాన్, మోహన్‌రామ్, రంగరాజ్‌పాండే ముఖ్య పాత్రలు పోషించారని చెప్పారు. చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుందని త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విశేషాలను వెల్లడించనున్నట్లు చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చెప్పారు. శుక్రవారం ఈచిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. దీనికి జిబ్రాన్ సంగీతాన్ని, ఏ.విశ్వనాఽథ్ చాయాగ్రహణం అందిస్తున్నారు.
అంగీకారం చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్


