ఐఐటీ గణిత విభాగానికి సిల్వర్ గుర్తింపు
సాక్షి, చైన్నె : ఐఐటీ మద్రాస్ గణిత శాస్త్ర విభాగానికి క్యాజువాలిటీ యాక్చురియల్ సొసైటీ నుంచి సిల్వర్–లెవల్ గుర్తింపు దక్కింది. గణిత శాస్త్ర విభాగం సహకారం, విద్యను ముందుకు తీసుకెళ్లడం, పరిశ్రమల అభివృద్ధికి తోడ్పాటుకుగాను ఈ గుర్తింపు లభించింది. ఈ ప్రతిష్టాత్మక గౌరవం, ఆస్తి, ప్రమాద బీమా, రిస్క్ మేనేజ్‌మెంట్‌లో కెరీర్‌కు విద్యార్థులను సిద్ధం చేయడంలో ఐఐటీ మద్రాసు అత్యుత్తమ ప్రతిభను కనబరిచి సీఏ పాఠ్యాంశాలతో బలమైన సమన్వయాన్ని ప్రతిబింబిస్తున్నది.ఐఐటీ మద్రాస్‌లోని గణిత విభాగం స్వచ్ఛమైన, అనువర్తిత గణితం, గణాంకాలు, ఆర్థిక నమూనాలలో అండర్ గ్రాడ్యుయేట్, మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్‌లతో విభిన్న పోర్ట్‌ఫోలియోను అందిస్తున్నది. కఠినమైన పరిశోధన, బోధనా నైపుణ్యానికి ప్రసిద్ధి చెందిన ఈ విభాగం, విద్యారంగం, ఆర్థికం, సాంకేతికత , యాక్చురియల్ ప్రాక్టీస్‌లో నాయకత్వ పాత్రలకు విద్యార్థులను సిద్ధం చేయడానికి, పరిశ్రమ భాగస్వాములతో సన్నిహిత సహకారాన్ని నిర్వహిస్తున్నదని గణిత శాస్త్ర విభాగం ప్రొఫెసర్ నీలేష్ ఎస్. ఉపాధ్యాయ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆధునిక యాక్చురియల్ సైన్‌న్స్‌కు గుండెకాయ లాంటి యాదృచ్ఛిక ప్రక్రియలు, తిరోగమనం, ఆర్థిక గణితం, డేటా విశ్లేషణలలో తమ విభాగం ధృడంగా ఉన్నట్టు తెలిపారు. ఈ గుర్తింపు అవకాశం దక్కడంలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌లు, విద్యార్థుల వేసవి కార్యక్రమ నియామకాలు, ఉమ్మడి పరిశోధన కార్యక్రమాల సహకారం లభించిందన్నారు. సిల్వర్–లెవల్ భాగస్వామిగా, ఐఐటీ మద్రాస్ అనేక ప్రయోజనాలు పొందుతుందన్నారు. సీఏఎస్ వేసవి కార్యక్రమాల్లో విద్యార్థులకు ప్రాధాన్యత నియామకాలు, బోధనా సామగ్రి , కేస్–స్టడీ లైబ్రరీలకు ప్రాధాన్యత, వార్షిక జనరల్ ఇన్సూరెన్‌న్స్ టీచర్స్ కాన్ఫరెనన్స్‌కు ఆహ్వానాలు, నిపుణులతో క్యాంపస్ ఈవెంట్‌లు, వర్చువల్ ప్రెజెంటేషన్‌ను స్పాన్సర్ చేయనున్నారని తెలిపారు. సీఏఎస్ యూనివర్సిటీ గుర్తింపు కార్యక్రమాల ద్వారా ఐఐటీ మద్రాసు సత్కరించడం ఆనందంగా ఉందన్నారు.


