హెల్మెట్ లేకుంటే జరిమానా
తిరుత్తణి: హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేసే ద్విచక్ర వాహనదారులకు రూ.వెయ్యి జరిమానా విధిస్తామని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. వాహన ప్రమాదాలు అరికట్టే విధంగా ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అయితే చాలా మంది హెల్మెట్ వినియోగించడంలో అలసత్వం వహిస్తున్నారు. దీంతో ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో తిరుత్తణిలో మంగళవారం ఉదయం పట్టణ బస్టాండు సమీపం అరక్కోణం రోడ్డుపై వెళ్లే ద్విచక్ర వాహనదారులను తనిఖీలు చేశారు. వంద మందిలో పట్టుమని పదిమంది కూడా హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపడంపై ట్రాఫిక్ పోలీసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల సమయంలో హెల్మెట్ ఉంటే ప్రాణాలు కాపాడుకోవచ్చునని అవగాహన కల్పించారు. తరుచూ అవగాహన కల్పిస్తున్నా ఏ మాత్రం పట్టించుకోకుండా ప్రయాణిస్తున్న వారికి రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తామని, వారి లైసెన్స్ సైతం రద్దు చేస్తామని హెచ్చరించారు.


