
పట్టుబడిన మొసలి
మొసలి పట్టివేత
అన్నానగర్: కడలూరు జిల్లా చిదంబరం సమీపంలోని పూలమేడు గ్రామ కొలనులోకి ప్రవేశించిన మొసలిని ఎట్టకేలకు అటవీ సిబ్బంది పట్టుకున్నారు. కొలనులోకి మొసలి వచ్చినట్లు గ్రామస్తులు శుక్రవారం అటవీ అధికారులకు సమాచారం అందించారు. చిదంబరం ఫారెస్ట్ అధికారి వసంత్ భాస్కర్ ఆధ్వర్యంలో చిదంబరం డివిజనల్ ఫారెస్టర్ ప్రభు, చిదంబరం బీట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ అన్బుమణి, భువనగిరి బీట్ ఫారెస్ట్ కన్జర్వేటర్ జ్ఞానశేఖర్, ఫారెస్ట్ కన్జర్వేటర్ అలమేలు, నందిమంగళం రాజ్ అక్కడికి వెళ్లారు. సుమారు 9 అడుగుల పొడవు, 145 కిలోల బరువు కలిగిన మొసలిని సురక్షితంగా పట్టుకున్నారు. చిదంబరం సమీపంలోని వక్కరమరి రిజర్వాయర్‌లో వదిలిపెట్టారు.
రోడ్లను నాణ్యతగా
నిర్మించండి
వేలూరు: వేలూరు కార్పొరేషన్ పరిధిలోని 34వ వార్డులో సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీంతో వార్డులోని సైదాపేట, చిన్నగౌండర్ వీధి ప్రాంతాల్లో జరుగుతున్న సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మేయర్ సుజాత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆ సమయంలో స్థానికులు అన్ని వీధులకు డ్రైనేజీ కాలువలు నిర్మించాలని మేయర్‌కు విన్నవించారు. తప్పక డ్రైనేజీ కాలువలు ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ఆమెతో పాటు కార్పొరేషన్ రెండవ డివిజన్ చైర్మన్ వీనస్ రవీంద్రన్, కార్పొరేటర్ చంద్రశేఖరన్, మాజీ కార్పొరేటర్ బాలాజి, ముత్తు పాల్గొన్నారు.

రోడ్డు పనులను తనిఖీ చేస్తున్న మేయర్