అందరూ దోషులే!

- - Sakshi

● గోకుల్‌ రాజ్‌ హత్య కేసులో హైకోర్టు ● మదురై ప్రత్యేకకోర్టు తీర్పునకు పచ్చజెండా ● అప్పీలు పిటిషన్లను తోసిపుచ్చిన బెంచ్‌

మద్రాసు హైకోర్టు

సాక్షి, చైన్నె: ఇంజినీరింగ్‌ విద్యార్థి గోకుల్‌రాజ్‌ పరువు హత్య కేసులో అప్పీలు పిటిషన్లను మద్రాసు హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ కేసులో 11 మందిని దోషులుగా పేర్కొంటూ మదురై ప్రత్యేక కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టు సమర్థించింది.

సేలం జిల్లా ఓమలూరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్తి గోకుల్‌ రాజ్‌ 2015 జూన్‌ 24న రైల్వేట్రాక్‌పై మృతదేహంగా తేలాడు. తల నరికి చంపి పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నాలు ఈ కేసులో జరిగాయి. ఈ కేసును డీఎస్పీ విష్ణుప్రియ విచారించారు. విచారణ సమయంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడడం అప్పట్లో కలకలం రేగింది. రంగంలోకి సీబీసీఐడీ దిగడంతో ఇది పరువు హత్యగా తేలింది. స్వాతి అనే అగ్రవర్ణ సామాజిక వర్గానికి చెందిన యువతితో వెనుకబడిన సామాజిక వర్గానికి చెందిన గోకుల్‌రాజ్‌ చెట్టా పట్టాలు వేసుకుని తిరిగిన సమాచారాలతో పోలీసులు ఆదిశగా దర్యాప్తు వేగాన్ని పెంచారు. ఈ కేసులో దీరన్‌ చిన్నమలై పేరవై నేత యువరాజ్‌తో పాటు 17 మందిని సీబీసీఐడీ అరెస్టు చేసింది.

అప్పీలు పిటిషన్‌..

ఈ పరువు హత్య కేసును తొలుత సేలం కోర్టు, ఆతర్వాత మదురై ప్రత్యేక కోర్టు విచారించింది. ఈ కేసులో కీలక ఆధారంగా ఈరోడ్‌ జిల్లా తిరుచంగోడులోని అర్ధనారీశ్వర ఆలయం సీసీ కెమెరాల దృశ్యాలు మారాయి. దీని ఆధారంగా మదురై ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. యువరాజ్‌కు మూడు యావజ్జీవ శిక్షణ, అతడి డ్రైవర్‌ అరుణ్‌, సన్నిహితుడు సెల్వకుమార్‌లకు రెండు యావజ్జీవాలు, మరో 8 మందికి తలా ఓ యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. విచారణ సమయంలో ఇద్దరు మరణించగా, మరో ఐదుగురిని నిర్ధోషులుగా ప్రకటించారు. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ యువరాజ్‌తో పాటు మిగిలిన నిందితులు హైకోర్టులో అప్పీలు పిటిషన్‌ వేశారు. అలాగే, ఐదుగురిని నిర్ధోషులుగా మదురై కోర్టు పేర్కొనడాన్ని వ్యతిరేకిస్తూ గోకుల్‌రాజ్‌ కుటుంబం కూడా అప్పీలు పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ అప్పీలు పిటిషన్లను న్యాయమూర్తులు రమేష్‌ , ఆనంద వెంకటేషన్‌ బెంచ్‌ విచారించింది. ఈ బెంచ్‌ తిరుచంగోడు ఆలయానికి వెళ్లి మరీ పరిశీలించి, విచారించి వచ్చారు.

తీర్పు ..

ఈ కేసు విచారణ సమయంలో స్వాతి కోర్టునే గందరగోళానికి గురి చేసే విధంగా ఫల్టీ కొట్టడం చర్చకు దారి తీసింది. చివరకు వాదనలు, ఆధారాల సమగ్ర పరిశీలనతో విచారణను కోర్టు ముగించింది. శుక్రవారం మధ్యాహ్నం న్యాయమూర్తులు తీర్పు వెలువరించారు. మదురై కోర్టు సమగ్ర విచారణ జరిపే తీర్పు ఇచ్చినట్టు న్యాయమూర్తులు సమర్థిస్తూ అభినందించారు. అర్ధనారీశ్వర ఆలయం సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా సరైన తీర్పును ఇచ్చిన్నట్టు పేర్కొన్నారు. ఈ కేసులో యువరాజ్‌కు మదురై కోర్టు ఇచ్చిన తీర్పును అమలు పరిచే విధంగా ఆదేశించారు. మిగిలిన వారందరికి యావజ్జీవ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. అప్పీలు పిటిషన్లను తోసిపుచ్చారు.

Read latest Tamil Nadu News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top