ఇందిరమ్మ పథకం.. | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ పథకం..

Jun 19 2026 2:06 AM | Updated on Jun 19 2026 2:06 AM

గుడిసె ఇళ్ల సర్వే

భానుపురి (సూర్యాపేట) : పేదల సొంతింటి కలను నేరవేర్చేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రకటనలకే పరిమితమవుతోంది. మొదటి విడతగా నియోజకవర్గానికి 3500 ఇళ్ల చొప్పున కేటాయించింది. ఈ ఇందిరమ్మ ఇళ్లు కొన్ని పూర్తి కాగా మరి కొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. మొదటి విడతలో ఇళ్లు రాని వారికి జూన్‌ 2న రెండో విడతలో ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ నేటికీ జిల్లా వ్యాప్తంగా లబ్దిదారుల ఎంపిక మాత్రం జరగలేదు. ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా గుడిసె ఇళ్ల సర్వే చేపట్టింది. గుడిసెలున్న వారికే ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించడంతో లబ్ధిదారుల ఎంపిక ఇంకా ఆలస్యమయ్యే అవకాశం ఉంది.

మొదటి విడతలో 1600 ఇళ్ల గృహ ప్రవేశాలు

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలో భాగంగా సొంత జాగా ఉన్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి రూ.5 లక్షలు మంజూరు చేసింది. ప్రతి నియోజకవర్గానికి 3,500ల చొప్పున జిల్లాకు 12,868 ఇళ్లను కేటాయించింది. ఇందులో 8,200 ఇళ్లు మంజూరయ్యాయి. 1600 ఇళ్లు పూర్తయి లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేయగా 6200 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. ఈ నెలాఖరు నాటికి మరో 400 నుంచి 500 వరకు ఇందిరమ్మ ఇళ్లు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.

రెండో విడతకు ఎదురు చూపులు

ఇందిరమ్మ కమిటీలు ఆయా గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్లకు అర్హుల జాబితాను ఇవ్వగా..మొదటి విడతలో అందరికీ ఇవ్వలేని పరిస్థితి. దాంతో ప్రభుత్వం దాదాపు ఆరు నెలలుగా రెండోవిడత ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామంటూ ప్రకటనలు చేసుకుంటూ వస్తోంది. దాంతో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. తెలిసిన నాయకులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులను కలుస్తూ తమకు రెండోవిడతలో ఇల్లు ఇవ్వాలంటూ ప్రాధేయ పడుతున్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రెండో విడతను అసిఫాబాద్‌ జిల్లాలో ప్రారంభించగా.. అన్ని జిల్లాల్లోనూ లబ్ధిదారుల ఎంపిక ఉంటుందని, జాబితాలు వస్తాయని భావించారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ప్రకటనలే తప్ప.. ఆదేశాలు రాకపోవడంతో అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఏమీ చేయలేని పరిస్థితి.

రాష్ట్రంలో గుడిసెలు లేని తెలంగాణగా మార్చాలనే ఉద్దేశంతో గతంలోనే గుడిసెలు ఉన్న ఇళ్ల వివరాలను సేకరించారు. జిల్లాలో 3045 గుడిసె ఇళ్లు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చగా.. వీటిని మరోసారి సర్వే చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటికే జిల్లాలో 400 ఇళ్ల వరకు సర్వే పూర్తి కాగా.. మరో వారం రోజుల్లో మిగతా గుడిసె ఇళ్ల సర్వే పూర్తి చేయనున్నారు. ప్రభుత్వం ఇచ్చే రెండోవిడత ఇళ్లలో వీరికే ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. గుడిసెల వారితో పాటు మిగతా వారి ఎంపిక ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తుండడంతో దరఖాస్తు చేకున్న అర్హులు అయోమయానికి గురవుతున్నారు.

ఫ జూన్‌ 2న జాబితాలంటూ

ప్రభుత్వం ప్రకటనలు

ఫ ఇంతవరకు మంజూరు కాని

రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు

ఫ గుడిసెల సర్వేతో మారిన

ప్రాధాన్యతలు

ఫ ఆందోళనలో అర్హులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement