కోదాడరూరల్ : వానాకాల సీజన్ ప్రారంభమైనందున రైతులు సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. అందుకు అవసరమైన విత్తనాల కోసం ఫర్టిలైజర్ దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకొని కొందరు నకిలీ విత్తనాలను రైతులకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నారు. వాటితో సాగు చేస్తే సరైన దిగుబడి రాక రైతులు నష్టపోయే ప్రమాదం ఉంది. దాంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా నుంచి మండలం వరకు ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేసింది. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. పోలీసుశాఖ నకిలీ విత్తనాల రవాణాను అరికట్టేందుకు ప్రత్యేకంగా తనిఖీలు చేపడుతోంది. దానికి తోడు అధికారులు ఎప్పటికప్పుడు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
ప్రత్యేక టీంలు
నకిలీ విత్తనాల బెడద నుంచి రైతులను కాపాడేందుకు జిల్లా యంత్రాంగం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసింది. పోలీస్, వ్యవసాయ, రెవెన్యూ శాఖల అధికారులతో జిల్లా నుంచి మండలం వరకు టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. జిల్లాస్థాయిలో కలెక్టర్, ఎస్పీ, డీఏఓలతో పాటు జిల్లాస్థాయి అధికారులతో టీం ఏర్పాటు చేశారు. దాంతో పాటు డివిజన్, మండల స్థాయిలో టీంలను ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో ఎస్‌ఐ, ఏఓ, తహసీల్దార్‌తో కూడిన టాస్క్‌ఫోర్స్ బృందం విత్తన షాపుల్లో ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నది. మండల, డివిజన్ స్థాయిలో డీలర్లు, షాపుల యజమానులతో సమావేశాలు ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే పీడీ యాక్ట్ కూడా పెడతామంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
రైతులకు అవగాహన
నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోస పోవద్దని అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. కొందరు ఇతర ప్రాంతాల నుంచి వచ్చి బిల్లులు లేకుండా విత్తనాలు విక్రయిస్తుంటారని, ఈ విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి సమాచారం అందించాలని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని, లైసెన్స్ కలిగిన డీలర్ల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని, కొనుగోలు చేసిన తప్పక రసీదు తీసుకోవాలని, దానిని పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఫ గుర్తించేందుకు ప్రత్యేక
టాస్క్‌ఫోర్స్ బృందాలు
ఫ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా తనిఖీలు
ఫ రైతులను అప్రమత్తం చేస్తున్న
వ్యవసాయశాఖ అధికారులు


