‘జాన్‌పహాడ్‌’ కాలువలకు మరమ్మతులు | - | Sakshi
Sakshi News home page

‘జాన్‌పహాడ్‌’ కాలువలకు మరమ్మతులు

Jun 18 2026 1:59 AM | Updated on Jun 18 2026 1:59 AM

కాలువ కట్టల వెడల్పు, లైనింగ్‌

పనులకు రూ.63 కోట్లు మంజూరు

నేరేడుచర్ల మండలంలో

ఆర్‌–3 కాలువ పనులు ముమ్మరం

పట్టణ పరిధిలోనూ పనులు

చేపట్టాలని రైతుల డిమాండ్‌

నేరేడుచర్ల : నాగార్జున సాగర్‌ ఎడమ కాలువ పరిధిలోని జాన్‌పహాడ్‌ మేజర్‌, దాని పరిధిలోని 9 మైనర్‌ కాలువలు కొత్తకళను సంతరించుకోబోతున్నాయి. ఆయా కాలువలను మరమ్మతులు చేపట్టి లైనింగ్‌ వేసేందుకు నీటి పారుదల శాఖ రూ.63 కోట్ల నిధులు మంజూరు చేసంది. జాన్‌పహాడ్‌ మేజర్‌ నేరేడుచర్ల, పాలకవీడు, గరిడేపల్లి మండలాల్లో మొత్తం 25 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీని పరిధిలో 38వేల ఎకరాల ఆయకట్టు ఉంది. గతంలో మేజర్‌తోపాటు మైనర్‌ కాలువ కట్టలు బలహీనంగా మారి తరచూ గండ్లు పడడంతో సాగునీరు అందక పంటలు ఎండి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యను గుర్తించిన నీటిపారుదల శాఖ మంత్రి నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో తన శాఖ నుంచి నిధులు మంజూరు చేయించారు. వెంటనే జాన్‌పహాడ్‌ మేజర్‌, మైనర్ల మరమ్మతు పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించడంతో పనులు ముమ్మరం చేశారు.

కొనసాగుతున్న ఆర్‌–3 పనులు

జాన్‌పహాడ్‌ మేజర్‌ పరిధిలోని నేరేడుచర్ల మండలంలో 8 కిలోమీటర్ల పొడవు, 3,500 ఎకరాల ఆయకట్టు కలిగిన ఆర్‌–3 కాలువ మరమ్మతులు కొనసాగుతున్నాయి. ముందుగా మండల పరిధిలో 6 కిలోమీటర్ల వరకు మరమ్మతులు, కాలువ వెడల్లు పనులు చేపట్టారు. ఇవి పూర్తికాగానే మరో వారం రోజుల్లో లైనింగ్‌ పనులు చేయనున్నారు. నేరేడుచర్ల పట్టణం గుండా వెళ్తున్న ఆర్‌–3 కాలువ పట్టణ పరిధిలోని రెండు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. దీంతో ఇప్పటికే కాలువ కట్టలను ఆక్రమించి నివాస గృహాలు, వ్యాపార సముదాయాలను ఏర్పాటు చేశారు. కొందరు నివాసితులు, వ్యాపారులు చెత్తాచెదారాన్ని కాలువలోనే పడేస్తుండడంతో పూడిక పేరుకుపోయింది. ఫలితంగా నీటి ప్రవాహం పెరిగినప్పుడు కాలువ పొంగి ఇళ్లలోకి నీరు చేరుతోంది. మరోవైపు నీరు వృథా అవుతుండడంతో కాలువ చివరి భూములకు సాగునీరు అందక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నారు. కాలువ లైనింగ్‌ పనులు పూర్తయితేనే పట్టణంలో నీటి వృథా అరికట్టబడి, చివరి భూములు సస్యశ్యామలం అవుతాయి.

నీటి వృథాకు అడ్డుకట్ట పడేనా!

ప్రస్తుతం ఆర్‌–3 కాలువ ఇరువైపులా పనులు జరుగుతున్నప్పటికీ.. పట్టణ పరిధిలో మాత్రం పనులు చేపట్టడం లేదు. దీంతో మళ్లీ పాత సమస్యే పునరావృతమై నీరు వృథా అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ గుండా వెళ్లే కాలువ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ పనులు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement