నెల రోజుల్లో పనులు ప్రారంభిస్తాం
మఠంపల్లి : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ప్రధాన అంతర్ రాష్ట్ర రహదారి అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతుండడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మఠంపల్లి మండలంలోని మట్టపల్లి నుంచి హుజూర్‌నగర్ వరకు గల 25 కిలోమీటర్ల ప్రధాన రహదారిని అంతర్ రాష్ట్ర రహదారిగా విస్తరించేందుకు ప్రభుత్వం రెండేళ్ల క్రితమే రూ.80 కోట్ల నిధులు మంజూరు చేసింది. భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగింది. కానీ, ఇప్పటికీ ప్రధాన రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంపై స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వందలాది సిమెంట్ లారీలు..
రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు సాగించే వాహనాలతోపాటు, మఠంపల్లి మండల పరిధిలోని భారీ సిమెంట్ పరిశ్రమలకు చెందిన వందలాది లారీలు, అతి భారీ వాహనాలు నిత్యం ఈ రహదారి గుండానే ప్రయాణిస్తుంటాయి. దీనివల్ల ఈ రోడ్డు అనునిత్యం రద్దీగా ఉంటోంది. రోడ్డు రద్దీగా మారడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
48 కల్వర్టులకు 36 పూర్తి..
రోడ్డు పనులు ప్రారంభించడానికి 25 కిలోమీటర్లలో సుమారు 48 చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉందని వాటిలో 36 కల్వర్టులు పూర్తిచేశామని ఆర్‌అండ్‌బీ అధికారులు చెబుతున్నారు. కల్వర్టుల నిర్మాణం కొనసాగుతున్నప్పటికీ ప్రధాన రహదారి పనులు ప్రారంభించపోవడంతో వాహనాల రద్దీతో ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు ప్రారంభించి యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని కోరుతున్నారు.
మట్టపల్లి–హుజూర్‌నగర్ వరకు 25 కిలోమీటర్ల అంతర్ రాష్ట్ర రహదారిలో ప్రస్తుతం కల్వర్టుల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. మొత్తం 48 చోట్ల కల్వర్టులు నిర్మించాల్సి ఉండగా 36 చోట్ల కల్వర్టులు నిర్మించాం. డబుల్ రోడ్డు పనులు నెల రోజుల్లో ప్రారంభించి ఒక సంవత్సరం కాలంలోనే మొత్తం రోడ్డు నిర్మాణం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
–శివకుమార్, ఆర్‌అండ్‌బీ ఏఈఈ మఠంపల్లి
ఫ మట్టపల్లి–హుజూర్‌నగర్
రోడ్డుకు రూ.80 కోట్లు మంజూరు
ఫ రెండేళ్లయినా నత్తనడకన పనులు
ఫ భారీ వాహనాల రాకపోకలతో
రద్దీగా మారిన రోడ్డు
ఫ అంతర్ రాష్ట్ర రహదారిపై
వాహనదారుల అవస్థలు


