సూర్యాపేటటౌన్ : గ్రీవెన్స్ డేలో వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని ఎస్పీ నరసింహ అన్నారు. సోమవారం సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన పోలీస్ గ్రీవెన్స్ డేలో ఫిర్యాదుదారుల నుంచి వినతులు స్వీకరించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. బాధితుల సమస్యలు విని, వాటిని పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా సూచించారు.
నకిలీ విత్తనాల పట్ల రైతులు
అప్రమత్తంగా ఉండాలి
రైతులు నకిలీ విత్తనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ నరసింహ కోరారు. వానాకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పత్తి, మిర్చి, వరి సాగు చేసే రైతులు అనుమతులు పొందిన విత్తన దుకాణాల నుంచే విత్తనాలు కొనుగోలు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడైనా అనుమానాస్పద సమాచారం ఉంటే వెంటనే డయల్ 100, 112 లేదా జిల్లా కంట్రోల్ రూమ్ 8712686026కు సమాచారం అందించాలని ఎస్పీ కోరారు.
జెడ్పీ సీనియర్
అసిస్టెంట్ సస్పెన్షన్
భానుపురి (సూర్యాపేట) : పంచాయతీ కార్యదర్శుల నుంచి అక్రమ వసూళ్లకు పాల్పడిన జెడ్పీ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ ఎస్‌కె.మెయినొద్దీన్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గరిడేపల్లి మండలంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న సమయంలో కార్యదర్శుల నుంచి వసూళ్లకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టగా అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు విచారణలో రుజువు కావడంతో ఆయన్ను సస్పెండ్ చేశారు.
ఆయిల్ పామ్ రైతు
సంఘం జిల్లా కార్యవర్గం
సూర్యాపేట : ఆయిల్ పామ్ రైతుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని సోమవారం సూర్యాపేటలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మన్నెం సదాశివరెడ్డి, ఉపాధ్యక్షుడిగా నాగిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా యలమర్తి బ్రహ్మారెడ్డి, సహాయ కార్యదర్శిగా గడ్డం సత్యనారాయణ, సంయుక్త కార్యదర్శిగా తూముల ఇంద్రసేనారావు, కోశాధికారిగా ఉమా మహేశ్వరరావు, కార్యవర్గ సభ్యులుగా లక్ష్మీకాంతారావు, పులుసు వెంకటయ్య, కిరణ్ కుమార్, ఎస్.త్రివేది, పి.వెంకటేశ్వరరెడ్డి, ఎలికంటి దామోదర్ రావులు ఎన్నికయ్యారు.
శివయ్యకు పుష్పార్చన
మేళ్లచెరువు : మండలకేంద్రంలోని శ్రీ ఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వర స్వామి ఆయలంలో సోమవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పుష్పార్చనతోపాటు గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, మహాలింగార్చన,గోపూజ నిర్వహించారు. భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి అర్చకులు విష్ణువర్ధన్‌శర్మ, ధనుంజయశర్మ పాల్గొన్నారు.


