తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మంగళవారంతో 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో 2016లో సూర్యాపేట కేంద్రంగా కొత్త జిల్లా ఆవిర్భవించన అనంతరం అభివృద్ధిని పరిశీలిస్తే అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు కనిపిస్తున్నాయి. సూర్యాపేటకు రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యం, సాగు, తాగునీరు, రహదారులు, సంక్షేమ రంగాలకు భారీగా నిధులు కేటాయించింది. జిల్లా కేంద్రం నుంచి గ్రామాల వరకు మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్, పోలీస్ పరిపాలన, వైద్య, విద్యా సేవలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. జిల్లా స్థాయి పరిపాలన అందుబాటులోకి రావడంతో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి.


