భానుపురి (సూర్యాపేట) : రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, అన్ని శాఖల అధికారులు రోడ్డు భద్రతా చర్యల్లో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ సూచించారు. జిల్లాలోని ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, ఆర్‌అండ్‌బీ, రైల్వే, ఇరిగేషన్, ఆర్టీఓ, ఎడ్యుకేషన్, డీఎంహెచ్‌ఓ, పోలీస్ అధికారులు, జిల్లా అధికారులతో శనివారం కలెక్టరేట్ వీసీహాల్లో రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఎస్పీ కె. నరసింహతో కలిసి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలతో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకూడదని, ఈ విషయమై ప్రజలకు అవగాహన కల్పించడానికి రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమాలలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. రహదారులపై లోపాలను గుర్తించి సవరించాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులను ఆదేశించారు. గ్రామస్థాయిలో రోడ్డు భద్రత కమిటీలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున గ్రామాలలో రోడ్డు భద్రత అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. ఎస్పీ కె.నరసింహ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల సమయంలో పౌరులు బాధ్యతగా ఉండాలని, ప్రమాద సమయంలో సహాయ సహకారాలు అందించే వారికి లీగల్‌గా ఎలాంటి ఇబ్బందులు రావని స్పష్టం చేశారు. ఆటోలు, ట్రాలీలలో ఎక్కువ మందితో ప్రయాణం ప్రమాదకరమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బి. హరిసింగ్, డీఎంహెఓ వెంకటరమణ, డీఈఓ అశోక్, ఆర్టీఓ జయప్రకాశ్‌రెడ్డి, డీపీఓ యాదగిరి, డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సురేందర్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్


