గరిడేపల్లి : స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శనివారం ఇద్దరు ఉద్యోగులు ఘర్షణ పడ్డారు. మండలంలోని లచ్యాతండా గ్రామ పంచాయతీ కార్యదర్శి సుధాకర్ మండల పరిషత్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మొయినొద్దీన్ వాహనాన్ని అడ్డుకొని తన సర్వీస్‌బుక్ ఎందుకు ఎంట్రీ చేయడం లేదంటూ నిలదీశాడు. తాను గతంలో పని చేసిన ప్రాంతాల జాయినింగ్ ఆర్డర్స్ ఉన్నప్పటికీ వాటిని సర్వీస్ బుక్‌లో నమోదు చేయడం లేదని, బుక్‌లో ఎంట్రీల కోసం రూ.3వేలు డిమాండ్ చేశారని సుధాకర్ ఆరోపించాడు. మొయినొద్దీన్ సోమవారం సూర్యాపేట జెడ్పీ కార్యాలయానికి బదిలీపై వెళ్లనున్న నేపథ్యంలో తన సమస్యను తక్షణమే పరిష్కరించాలని కోరాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. సీనియర్ అసిస్టెంట్ లంచ్ బాక్స్‌తో తనపై దాడి చేశాడని పంచాయతీ కార్యదర్శి ఆరోపించాడు. సిబ్బంది వారిద్దరిని వారించడంతో పరిస్థితి సద్దుమణిగింది.


