మూడు నెలలైనా అందని వాహన రిజిస్ట్రేషన్‌ కార్డులు | - | Sakshi
Sakshi News home page

మూడు నెలలైనా అందని వాహన రిజిస్ట్రేషన్‌ కార్డులు

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం ఆర్‌సీ రాలేదు

వాహన పరివాహన్‌ పోర్టల్‌ వచ్చిన తర్వాత జిల్లాలో ఈ ఏడాది మార్చి 23వ తేదీ నుంచి ద్విచక్ర వాహనాలు, కార్ల రిజిస్ట్రేషన్‌లు షోరూంలోనే నిర్వహిస్తున్నారు. రవాణాశాఖ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేదు. సాంకేతిక కారణాల వల్ల కొంత ఆలస్యం అవుతోంది. పెండింగ్‌లో ఉన్న కార్డులను దశల వారీగా ముద్రించి పంపిణీ చేస్తున్నాం. త్వరలో సమస్య పూర్తిగా పరిష్కారమవుతుంది. వాహనదారుల ఇళ్ల వద్దకే కార్డులు పంపిస్తాం.

–జయప్రకాష్‌రెడ్డి,

జిల్లా రవాణశాఖ అధికారి, సూర్యాపేట

మార్చి నెలలో నేను కొత్త బైక్‌ కొన్నాను. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ షోరూంలోనే పూర్తయింది. కానీ ఇప్పటివరకు ఒరిజినల్‌ ఆర్‌సీ రాలేదు. నంబర్‌ వచ్చినప్పటికీ ఆర్‌సీ లేకపోవడంతో పోలీసులు తనిఖీ చేసినప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. అధికారులు స్పందించి ఆర్‌సీ త్వరగా వచ్చేలా చూడాలి.

–రమావత్‌ చాంప్లా, వాహనదారుడు

జిల్లాలో సుమారు

900 కార్డులు పెండింగ్‌

పోలీసుల తనిఖీల్లో ఇబ్బందులు

ఎదుర్కొంటున్న వాహనదారులు

సూర్యాపేటటౌన్‌ : కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వాహనదారులకు రిజిస్ట్రేషన్‌ కార్డు(ఆర్‌సీ)ల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా వాహన్‌ విధానం అమలులోకి తీసుకొచ్చినప్పటికీ అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. గతంలో జిల్లా రవాణాశాఖ కార్యాలయం ద్వారానే ద్విచక్ర వాహనాలు, కార్లు (నాన్‌ ట్రానన్స్‌పోర్ట్‌) రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేది. కేంద్ర ప్రభుత్వం శ్రీవాహన్‌శ్రీవిధానం అమలులోకి తీసుకువచ్చిన తరువాత ఈ ఏడాది మార్చి 23 నుంచి రిజిస్ట్రేషన్ల బాధ్యతలను వాహన షోరూంల నిర్వాహకులకు అప్పగించింది. ఈ కొత్త విధానంలో వాహనం కొనుగోలు చేసిన వెంటనే తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ నంబరు ఇస్తున్నారు. అనంతరం నెల రోజుల్లో శాశ్వత రిజిస్ట్రేషన్‌ నంబరు కేటాయించాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్‌ నంబర్‌ కేటాయించినప్పటికీ వాహన రిజిస్ట్రేషన్‌ కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోందని వాహనదారులు చెబుతున్నారు.

ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్‌ పనులకు ఇబ్బంది

సూర్యాపేట జిల్లాలో ద్విచక్ర వాహనాలు, కార్లు కలిపి సుమారు 900 రిజిస్ట్రేషన్‌ కార్డులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నాయి. ద్విచక్ర వాహనాలు, కార్లు కొనుగోలు చేసినవారు ఇప్పటికే తమ వాహనాలకు నంబర్‌ ప్లేట్లు బిగించుకున్నారు. కానీ ఆర్‌సీ కార్డులు అందకపోవడంతో కార్యాలయాలు, షోరూంల చుట్టూ తిరుగుతున్నారు. కొంతమంది వాహనదారులు మూడు నెలల క్రితమే వాహనాలు కొనుగోలు చేసినప్పటికీ ఇప్పటివరకు రిజిస్ట్రేషన్‌ కార్డులు అందలేదని వాపోతున్నారు. ఆర్‌సీ లేకపోవడంతో బ్యాంకు రుణాలతో కొనుగోలు చేసిన వాహనాల విషయంలో ఇన్సూరెన్స్‌, ఫైనాన్స్‌ సంబంధిత పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు పేర్కొంటున్నారు.

షోరూంలపై పెరిగిన భారం..

కొత్త విధానం ప్రకారం వాహనాల వివరాలు, యజమాని ఆధార్‌, చిరునామా ధృవీకరణ పత్రాలు, ఇన్సూరెనన్స్‌, పన్ను చెల్లింపుల వివరాలను షోరూం నిర్వాహకులు ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే సాంకేతిక సమస్యలు, సర్వర్‌ సమస్యలు, డాక్యుమెంట్ల ధృవీకరణలో ఆలస్యం కారణంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ నెమ్మదించిందని తెలుస్తోంది. కొన్ని షోరూంలలో ప్రత్యేక సిబ్బంది లేకపోవడం కూడా సమస్యగా మారింది. రోజూ పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో వాటిని సమయానికి అప్‌లోడ్‌ చేయలేకపోతున్నామని నిర్వాహకులు చెబుతున్నారు.

ఆందోళనలో వాహనదారులు..

ఆర్‌సీ లేకపోవడంతో ట్రాఫిక్‌ పోలీసుల తనిఖీల సమయంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని వాహనదారులు చెబుతున్నారు. పోలీసులు అడిగినప్పుడు మొబైల్‌లో డిజిటల్‌ కాపీలు చూపిస్తున్నప్పటికీ చాలాసార్లు వివరణ ఇవ్వాల్సి వస్తోందని వాపోతున్నారు. అధికారులు వెంటనే చర్యలు తీసుకుని వాహనాల రిజిస్ట్రేషన్‌ కార్డులు త్వరగా అందేలా చూడాలని వాహనదారులు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement