అర్వపల్లి : కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని దివాలా తీయిస్తోందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మండారి డేవిడ్‌కుమార్ విమర్శించారు. ఏఐకేఎంఎస్(ఆల్ ఇండియా కిసాన్ మజ్దూర్ సభ), ఎస్‌కెఎం(సంయుక్త కిసాన్ మోర్చా) పిలుపుమేరకు గురువారం జాజిరెడ్డిగూడెంలో ఎంఎస్‌పీ(కనీస మద్దతు ధర) ఆర్డర్ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంఎస్ స్వామినాథన్ సిఫార్సులను అమలుచేయాలని, రైతుల పంటలకు కనీస మద్దతు ధర కల్పిస్తూ ఎంఎస్‌పీ చట్టం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, పోలెబోయిన కిరణ్, పెద్దలింగయ్య, వడకాల బయ్యన్న, మధుకర్, రైతులు పాల్గొన్నారు.
జూన్ 2న పాదయాత్ర
సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి జూన్ 2వ తేదీ నుంచి సీపీఐ(ఎంఎల్)మాస్ లైన్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టే పాదయాత్రను జయప్రదం చేయాలని పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి కొత్తపల్లి శివకుమార్ పిలుపునిచ్చారు. గురువారం సూర్యాపేట పట్టణంలోని కామ్రేడ్ విక్రమ్ భవన్‌లో పాదయాత్రకు సంబంధించిన కరపత్రాలను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా కమిటీ సభ్యుడు కారింగుల వెంకన్న, పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి కొత్తపల్లి రేణుక, పీడీఎస్‌యూ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు ఎర్ర అఖిల్ కుమార్, పేర్ల నాగయ్య, సూరం రేణుక పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలకు
క్షమాపణ చెప్పాలి
భానుపురి (సూర్యాపేట) : తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన టీ టీడీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఈ ప్రాంత ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తెలంగాణ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంతుల మధు డిమాండ్ చేశారు. గురువారం తెలంగాణ యువజన సంఘం ఆధ్వర్యంలో సూర్యాపేటలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బక్కని నర్సింహులు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ.. ఏపీలో జరిగిన టీడీపీ జాతీయ మహానాడులో బక్కని నర్సింహులు తెలంగాణ అనే పదం డిక్షనరీలో లేదని వ్యాఖ్యనించడం సరైంది కాదన్నారు. వందలాది సంవత్సరాల క్రితమే ‘త్రిలింగ దేశం’గా వర్థిల్లిన ప్రాంతం తెలంగాణమని, తెల్లాపూర్ శాసనంలో తెలంగాణ గురించి స్పష్టంగా ఉందని తెలిపారు.కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాషిపంగు సునీల్, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు సంతోష్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గుగులోత్ సురేష్ నాయక్, నాయకులు వెంకటేష్ నాయక్, జక్కలి గోపి, చింతకాయల మహేష్ పాల్గొన్నారు.
శాస్త్రోక్తంగా
నరసింహుడి కల్యాణం
మఠంపల్లి : మట్టపల్లి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శ్రీరాజ్యలక్ష్మీచెంచులక్ష్మీసమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి కల్యాణాన్ని గురువారం అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, రుత్విగ్వరణం, మదుఫర్కపూజ, మాంగల్యధారణ, వేద మంత్రోచ్ఛరణల నడుమ తలంబ్రాలతో కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, చెన్నూరు విజయ్‌కుమార్, ఈఓ జ్యోతి అర్చకులు రామాచార్యులు, పద్మనాభాచార్యులు, సాయిచార్యులు, లక్ష్మీనరసింహమూర్తి, ఆంజనేయాచార్యులు, నాగభూషణం, నరేందర్ పాల్గొన్నారు.


