పాలిటెక్నిక్‌ కళాశాలల్లో నూతన కోర్సులు | - | Sakshi
Sakshi News home page

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో నూతన కోర్సులు

May 29 2026 5:47 AM | Updated on May 29 2026 5:47 AM

రామగిరి(నల్లగొండ) : సాంకేతిక విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. పరిశ్రమల అవసరాలు, మార్కెట్‌ డిమాండ్‌కు అనుగుణంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్త కోర్సులు అందుబాటులోకి తెస్తోంది. సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారులు ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కళాశాలల్లో ప్రస్తుతం ఉన్న కోర్సులకు అనుబంధంగా కొత్త కోర్సుల నిర్వహణకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సరికొత్త డిప్లొమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే సాఫ్ట్‌వేర్‌, ఆటోమేషన్‌, అధునాతన మ్యాన్‌ఫ్యాక్చరింగ్‌ రంగాల్లో స్థిరపడటానికి అద్భుతమైన అవకాశాలు లభించనున్నాయి.

ఐదు కళాశాలల్లో కొత్త కోర్సులు..

ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా మొత్తం ఐదు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలు (నల్లగొండ, సూర్యాపేట, తిరుమలగిరి, నాగార్జునసాగర్‌, యాదగిరిగుట్ట) ఉన్నాయి. నల్లగొండలో ఇంజనీరింగ్‌ అండ్‌ ఎలక్ట్రిక్‌ వెహికిల్‌ టెక్నాలజీ, నాగార్జునసాగర్‌లో అడ్వాన్స్‌డ్‌ మ్యాన్‌ఫాక్చరింగ్‌ టెక్నాలజీ, సూర్యాపేటలో ల్యాండ్‌ స్కేప్‌ డిజైన్‌, తిరుమలగిరిలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌, యాదగిరిగుట్టలో కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు వచ్చాయి. ప్రస్తుత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకునేందుకు వీలుగా ఈసారి అడ్వాన్స్‌డ్‌ కోర్సులకు అనుమతులు మంజూరయ్యాయి.

కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభం

టీజీ పాలిసెట్‌ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో, ఈ కొత్త కోర్సులతో కలిపి ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. ఈ నెల 27 నుంచి 31 వరకు స్లాట్‌ బుకింగ్‌, 29 నుంచి జూన్‌ 1 వరకు సరిఫికెట్‌ వెరిఫికేషన్‌, వెబ్‌ ఆప్షన్లు, జూన్‌ 6న కళాశాలల కేటాయింపు చేపడుతున్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే కొత్త కోర్సులు ప్రారంభం కానుండటంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఎంతగానో లబ్ధి చేకూరనుంది.

Advertisement
 
Advertisement
Advertisement