సూర్యాపేటటౌన్ : రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్‌సీ ప్రకటించాలని గిరిజన ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధరావత్ మోతీలాల్ నాయక్ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి ఐదు సంవత్సరాలకు ఇచ్చే పీఆర్‌సీని ఇప్పటి వరకు ప్రకటించక పోవడం శోచనీయమని పేర్కొన్నారు. ప్రభుత్వాలు ఉద్యోగ, ఉపాధ్యాయుల హక్కులను కాలరాస్తూ కాలం వెళ్లదీస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పీఆర్సీ ప్రకటించాలని, లేని పక్షంలో జూన్ రెండు తర్వాత పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
సర్వే ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలి
ఫ అదనపు కలెక్టర్ హరిసింగ్
నూతనకల్ : భూముల రీసర్వే ప్రక్రియను అధికారులు త్వరితగతిన పూర్తి చేయాలని అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ ఆదేశించారు. మండలంలోని వివిధ గ్రామాల్లో భూముల రీసర్వే, ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీలింగ్ భూములకు సంబంధించిన రైతుల వివరాలను తెలుసుకొని వారి భూమి స్వాధీనత ప్రకారం సర్వే పూర్తి చేసి కలెక్టర్‌కు నివేదిక అందించాలన్నారు. సాదా బైనామాలు, భూ భారతి, గ్రీవెన్స్‌ల ద్వారా వచ్చిన దరఖాస్తులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని సూచించారు. వానాకాలం సమీపిస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యాన్ని ఐదు రోజుల్లో పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని ఆదేశించారు. అనంతరం మండల కేంద్రంలోని ధాన్యం గోదామును ఆయన పరిశీలించారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసరావు, అధికారులు ఉన్నారు.
ఉచిత కోచింగ్‌కు దరఖాస్తుల ఆహ్వానం
నల్లగొండ : రాష్ట్ర మైనార్టీ పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం అడ్మిషన్లకు ఎంట్రెన్స్ టెస్టు రాసే మైనార్టీ విద్యార్థులకు మైనార్టీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇవ్వనున్న ఉచిత కోచింగ్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి టి.విజయేందర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్సీలు మైనార్టీలుగా పరిగణించబడతారని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.


