విద్యార్థులకు ఎంతో మేలు
సూర్యాపేట టౌన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపర్చడంతో పాటు వారిలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ప్రాథమిక స్థాయి విద్యార్థులకు మాత్రమే అందజేస్తున్న అభ్యాస దీపిక (వర్క్‌బుక్)లను ఇకపై ఉన్నత పాఠశాల స్థాయి విద్యార్థులు కూడా అందజేయాలని నిర్ణయించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదివే విద్యార్థులకు కూడా అభ్యాస దీపికలు అందుబాటులోకి రానున్నాయి.
నేర్చుకునే విధానంలో మార్పు..
జిల్లాలో 950 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 180 ఉన్నత, 80 ప్రాథమికోన్నత, 680 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో సుమారు 65వేల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల్లో ప్రాథమిక నైపుణ్యాలు, పఠన సామర్థ్యం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించేందుకు అభ్యాస దీపికలు ఉపయోగపడతాయని విద్యాశాఖ భావిస్తోంది. ప్రతి పాఠానికి అనుగుణంగా ప్రశ్నలు, వ్యాయామాలు, కార్యకలాపాలు, చిత్రాలు, సృజనాత్మక అంశాలతో ఈ వర్క్‌బుక్‌లను రూపొందించారు. దీంతో విద్యార్థులు పాఠ్యాంశాలను కేవలం చదవడం కాకుండా స్వయంగా అర్థం చేసుకొని అభ్యసించే అవకాశం ఉంటుంది.
పదో తరగతి విద్యార్థులకు ఉపయోగం..
ప్రత్యేకించి పదో తరగతి విద్యార్థులకు ఈ అభ్యాస దీపికలు ఎంతో ఉపయోగకరంగా మారనున్నాయి. బోర్డు పరీక్షలకు అనుగుణంగా నమూనా ప్రశ్నలు, ప్రాక్టీస్ వ్యాయామాలు, ముఖ్యాంశాలపై ప్రత్యేక విభాగాలు ఉండనున్నాయి. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇది మరింత తోడ్పడనుంది. అభ్యాస దీపికల ద్వారా ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను సులభంగా బోధించగలరని అధికారులు చెబుతున్నారు.
నాణ్యమైన విద్యే లక్ష్యంగా..
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను పెంచడం, ప్రైవేట్ పాఠశాలలకు సమానంగా నాణ్యమైన విద్య అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యంగా అభ్యాస దీపికలు అందజేస్తోంది. ఇప్పటికే పాఠ్యపుస్తకాలు, డిజిటల్ బోధన, మౌలిక సదుపాయాలపై దృష్టి పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు అభ్యాస దీపికల విస్తరణ ద్వారా విద్యార్థుల నేర్పు సామర్థ్యాల పెంపుపై ప్రత్యేక దృష్టిసారిస్తోంది. పాఠశాల స్థాయిలోనే ప్రాక్టీస్‌కు ప్రాధాన్యత పెరగడం వల్ల పిల్లల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అభిప్రాయపడుతున్నారు.
వర్క్ బుక్‌ల ప్రత్యేకతలు..
తెలుగు, ఆంగ్లం, ఉర్ధూ మాద్యమాల్లో వీటిని ముద్రించనున్నారు. పదో తరగతి వరకు తెలుగు, హిందీ, ఆంగ్లం, గణితం, సామాన్య శాస్త్రం, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులకు వీటిని అందించనున్నారు. మూల్యాంకనంతోపాటు ప్రతి పాఠం చివర అభ్యసన ప్రక్రియలకు సంబంధించిన ప్రశ్నలు–జవాబులు, ఖాళీలు, బాషా పుస్తకాల్లో వ్యాకరణం, గణితంలో సూత్రాలు, సాధన, సైన్స్, సాంఘిక శాస్త్రంలో పటాల అంశాలు ఉండటంతో ప్రతి పాఠంపై అవగాహన పెరిగే అవకాశం ఉంది.
కొత్తగా హైస్కూల్ వారికి అందజేయాలని నిర్ణయం
ఇప్పటికే ప్రాథమిక స్థాయి
విద్యార్థులకు పంపిణీ
నేర్పు, నైపుణ్యాల పెంపునకు
ప్రభుత్వ యోచన
జిల్లాలో 950 ఉన్నత పాఠశాలలు
వర్క్‌బుక్‌ల వల్ల విద్యార్థులకు ఎంతో మేలు జరగనుంది. నేర్చుకున్న పాఠాలల సాధనలను నిరంతరం పరిశీలించే అవకాశం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులను మెగురుపర్చి ఉత్తమ ఫలితాలను సాధించవచ్చు.
– అశోక్, జిల్లా విద్యా శాఖ అధికారి


