హుజూర్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు సోమవారం సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలపగా సీఎం ఆయనను అభినందించారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం మీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్పొరేషన్ పదవులకు పూర్తి న్యాయం చేయాలని సూచించినట్టు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు తెలిపారు.
ప్రజలకు సత్వర
న్యాయం అందిస్తాం
సూర్యాపేట టౌన్ : వివిధ సమస్యలపై పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలకు సత్వర న్యాయం అందేలా కృషిచేస్తున్నామని ఎస్పీ నరసింహ అన్నారు. సూర్యాపేటలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం పోలీస్ గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని వివిధ మండలాల నుంచి వచ్చిన బాధితులు ఎస్పీని ప్రత్యక్షంగా కలిసి తమ సమస్యలపై ఫిర్యాదులు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ప్రతి ఒక్క బాధితుడి సమస్యను విన్నారు. వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్ ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు. చట్టబద్ధమైన విధానంలో ప్రతి ఫిర్యాదును పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
శివయ్యకు పుష్పార్చన
మేళ్లచెరువు : మండల కేంద్రంలోని శ్రీఇష్టకామేశ్వరీ సమేత శ్రీస్వయంభు శంభులింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం నిత్యారాధనలు కొనసాగాయి. స్వామివారికి ప్రత్యేకంగా మహాలింగార్చన, పుష్పార్చన, గణపతిపూజ, పుణ్యాహవచనం, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, సహస్రనామార్చన, గోపూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఈఓ శంభిరెడ్డి, అర్చకులు విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తదితరులు పాల్గొన్నారు.
ఎర్రకుంట కబ్జాపై అధికారుల పరిశీలన
కోదాడ రూరల్ : కోదాడ పట్టణంలో గల 50 ఎకరాల ఎర్రకుంట చెరువు కబ్జాకు గురికావడంతో 15 ఎకరాలకు చేరుకుంది. దీనిపై ఈ నెల 22న సాక్షిలో ‘మాయమవుతున్న ఎర్రకుంట’ అనే శీర్షికన ప్రచురితమైన ప్రత్యేక కథనానికి ఎట్టకేలకు అధికారులు స్పందించారు. జిల్లా ఇరిగేషన్ చీఫ్ ఇంజినీర్ నాగభూషణరావు, ఆర్డీఓ సూర్యనారాయణ ఆధ్వర్యంలో రెండు శాఖల అధికారులు సోమవారం ఎర్రకుంట చెరువును పరిశీలించారు. చెరువు హద్దులు, ఎఫ్‌టీఎల్ పరిధి, చెరువు కట్టప్రాంతం ఆక్రమణలను పరిశీలించారు. సర్వే నిర్వహించి హద్దులు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తర్వాత ఆక్రమణలపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ కార్య క్రమంలో కోదాడ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ సత్యనారాయణ, డీఈఈ సువర్ణరేఖ, ఏఈఈ మహేష్ సిబ్బంది పాల్గొన్నారు.


