జిల్లా కేంద్ర జనరల్‌ ఆస్పత్రిలో వైద్య సేవల్లో జాప్యం | - | Sakshi
Sakshi News home page

జిల్లా కేంద్ర జనరల్‌ ఆస్పత్రిలో వైద్య సేవల్లో జాప్యం

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

రాత్రంతా ఆరుబయటే పడుకున్నాం

ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌కు

రెండు రోజులు ఆగాల్సిందే..

ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు

మూలన పడిన యంత్రాలు..

పర్యవేక్షణ కరువు

వినియోగంలో లేని

ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మిషన్‌

సూర్యాపేటటౌన్‌ : కడుపు నొప్పి, ఇతర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రికి వెళ్తే ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్‌.. రోగికి ఏమైందనే నిర్ధారణ కోసం ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ రాస్తుండగా ఆ స్కానింగ్‌ తీయించేందుకు రోగులు రెండు మూడు రోజులు ఆగాల్సి వస్తోంది. రూ.కోట్లు ఖర్చు చేసి కొనుగోలు చేసిన యంత్రాలు మూలన పడటం, కిట్లు అందుబాటులో రోగులకు వైద్య సేవలు అందడం లేదు. 2డి ఎకో లాంటి మెషిన్లు, ఎంఆర్‌ఐ స్కానింగ్‌ మిషన్‌ను వినియోగంలోకి తేకుండా మూలకు పడేశారు. జిల్లా ఆసుపత్రి కావడంతో రోజుకు వందలాది మంది రోగులు ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రికి వస్తుంటారు. కేవలం 30 నుంచి 40 మందికి మాత్రమే అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేస్తుండడంతో మిగిలిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిగతా వారికి నెంబర్లు ఇచ్చి రేపు రా.. లేకపోతే ఎల్లుండి రా అని సిబ్బంది చెబుతుండటం గమనార్హం. ప్రైవేట్‌ ల్యాబ్‌లలో స్కానింగ్‌ ఖర్చులు భరించలేక ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే, ఇక్కడ టోకెన్ల పద్ధతి పేరిట రోజుకు కేవలం 30 మందికే పరిమితం చేయడంపై రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం 7 గంటలకే వచ్చి క్యూ లైన్లలో నిల్చున్నా, చివరకు అవుట్‌ పేషంట్‌ల సంఖ్య 30 దాటిందని.. రోజు కోటా పూర్తయిందని సిబ్బంది బంద్‌ చేస్తున్నారు.

సమయపాలన పాటించని వైద్యులు

వైద్యులు అందుబాటులో ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. వైద్యుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే కొంత మంది వైద్యులు రాకపోవడంతో నర్సులు, కింద స్థాయి సిబ్బందే రోగులకు మందులు రాస్తున్నారు. శనివారం వైద్యులు సమయానికి రాకపోవడంతో ఆర్థోపెడిక్‌, జనరల్‌ మెడిసిన్‌ విభాగాల్లో కింది స్థాయి సిబ్బందే రోగులను చూసి మందులు రాయడం గమనార్హం. అలాగే సిటీ స్కాన్‌ పరీక్షలను రేడియాలజిస్ట్‌ పర్యవేక్షణలో చేయాల్సి ఉండగా, కేవలం ల్యాబ్‌ టెక్నీషియన్లతో తీయిస్తున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ నెల రోజులుగా సెలవులో ఉన్నారు. దీంతో ఆసుపత్రిలో పర్యవేక్షణ కరువైంది. కొంతమంది వైద్యులు ప్రైవేట్‌ వ్యక్తులతో డ్యూటీలు చేయిస్తున్నట్లు తెలిసింది. రోగులు రాత్రి వేళలో ఆసుపత్రికి వస్తే అడ్మిట్‌ చేసుకోకుండా బెడ్‌లు సైతం ఇవ్వడం లేదని రోగులు చెబుతున్నారు.

నియామకాల్లో జాప్యం..

ఆసుపత్రిలో కొన్ని అవుట్‌ సోర్స్‌ పోస్టులను ప్రభుత్వం గత నెల 18న విడుదల చేసింది. నెల రోజులలో జిల్లా స్థాయీలోనే నియమాలను చేపట్టాలని ఉత్తర్వులో పేర్కొంది. కానీ, సూపరింటెండెంట్‌ సెలవులో ఉండడంతో నేటికీ ఉద్యోగాలకు సంబందించిన నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. దీంతో జిల్లాకి కేటాయించిన రెండు పోస్టులు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.

ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ కోసం ఎదురు చూస్తున్న రోగులు

మూలకు పడిన ఎక్స్‌రే మిషన్‌

మా తమ్ముడు శ్రీనివాస్‌ కు కడుపు నొప్పితో పాటు కొంత మానసిక స్థితి బాగుండటం లేదు. శుక్రవారం సాయంత్రం ఆసుపత్రికి తీసుకొచ్చాం. సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెబుతూ అడ్మిట్‌ చేసుకోలేదు. రాత్రంతా ఆరుబయటే పడుకున్నాం. ఉదయం డాక్టర్‌ వచ్చాక చూపించి ఆల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ రాయడంతో తీయించేందుకు వచ్చా. ఇక్కడకు వచ్చాక రేపు రా అని సిబ్బంది అంటుండటంతో వారితో గట్టిగా మాట్లాడి స్కానింగ్‌ తీయించాను.

– శ్రీనివాస్‌, రాఘవపురం

Advertisement
 
Advertisement
Advertisement